" చింతామణి గణపతి - 3 "- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

" చింతామణి గణపతి - 3 "

గణుడు చింతామణిని బలవంతంగా తీసుకుపోగానే కపిలమహర్షి అమ్మవారిని ధ్యానించి జపం చేయగానే అమ్మవారు ప్రత్యక్షమై " దేనికి నాయనా పిలిచావు " అని అడిగితే మహర్షి అద్భుతమయిన విషయాలు ( మనకు కూడా ) చెప్పారు.

" అమ్మా గణుడు మణిని తీసుకుపోయాడు. నాకు ఆ మణిమీద కోరికాలేదు, దాని అవసరమూ లేదు, అతను తీసుకుపోయాడని బాధాలేదు. కాని అటువంటి అద్భుతమైన మణి అటువంటివారి వద్ద ఉండకూడదు. అన్నీ మణివల్ల తేరగా వస్తున్నాయంటే రాజు, ప్రజలు సోమరులవుతారు. ఖాళీగా కూర్చుని సమయం ఎలా గడపాలో తెలియక వ్యసనపరులు అవుతారు. రాజ్యం ( దేశం ) ప్రజలు భ్రష్టుపట్టిపోతారు " అని చెప్పి ఎలాగయినా ఆ మణి తిరిగివచ్చేలా చెయ్యమ్మా అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇది ఎంత సత్యమో తెలుస్తుంది.

అమ్మవారు ఓ మంత్రం చెప్పి " దీనిని జపం చేసి హోమం చెయ్యి. మణిని తీసుకొచ్చే ఆయన వస్తాడు " అని చెప్పారు.

మహర్షి అలా చేయగానే హోమగుండంలోంచి సిద్ధీ బుద్ధీ సమేత మహాగణపతి వచ్చి " విషయం నేను చూసుకుంటానులే " అన్నారు.

అవినీతి, అరాచకాలు చేసేవారు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు సహజంగానే. గణుడు మణిని తీసుకుపోయాడు కనుక మహర్షి ఆశ్రమంవద్ద గూఢచారులను పెట్టాడు. మహర్షి మణిని తిరిగి పొందడంకోసం ప్రయత్నాలు ఏమయినా చేస్తున్నారా తెలుసుకోవడానికి. వారు వచ్చి " హోమగుండంలోంచి ఎవరో వచ్చారు, మిమ్మల్ని చంపడానికే అయి ఉంటుంది " అని చెప్పారు.

" అతనెవరో మనమీదకు రావడమేమిటి, మనమే వెళ్ళి అతన్ని సంహరిద్దాం " అని యుద్ధానికి బయలుదేరాడు సైన్యంతో. అతనికి ఇద్దరు కొడుకులున్నారు. వారన్నారు " ఈమాత్రం దానికి మీరు ఎందుకు, మేము వెళ్ళి అతన్ని చంపివస్తాము " అని.

వీరిద్దరూ సైన్యంతో వెళ్ళి ఆశ్రమాన్ని ముట్టడించడంతో సిద్ధీదేవి స్వామి అనుమతి తీసుకుని గణుడి పుత్రులనూ, సైన్యాన్నీ చంపేసింది.

అదీ మన నారీశక్తి గొప్పదనం. స్త్రీని శక్తిస్వరూపిణిగా తలచి గౌరవించే సంస్కృతి మన సనాతనధర్మంలోనే కనబడుతుంది ప్రపంచంలో.

ఈ వార్తవిని గణుడు రెచ్చిపోయి సైన్యంతో వచ్చాడు. స్వామి అతన్ని చంపేసి చింతామణిని తీసుకొచ్చి మహర్షికి ఇచ్చారు. మహర్షి " మణి నాకొద్దు, మీ దగ్గరే ఉంచండి " అంటే స్వామి " దీనికోసమే కదా అమ్మవారిని ధ్యానించావు. నాకోసం జపం, హోమం చేసావు. ఇప్పుడు మణి వద్దంటావేమిటి " అంటే మహర్షి " ఇలాంటి మణులు సాధారణ మానవుల దగ్గర ఉండకూడదు. నా దగ్గర ఉండడంవల్లేకదా ఈ బాధలన్నీ కలిగాయి. ఈ మణిని మీ దగ్గరే ఉంచుకుని భక్తులకు కోరినవన్నీ ప్రసాదించండి. ఇప్పటినుంచీ భక్తులు మిమ్మల్ని ' చింతామణీగణపతి ' గా పూజిస్తారు " అన్నారు. 

ఇదీ " చింతామణీగణపతి " వృత్తాంతం. అప్పటినుంచీ స్వామి భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తునే ఉన్నారు.

ఏతత్ సర్వం శ్రీచింతామణీగణపతి అర్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ