శ్రీలలితానామం - 757 - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" క్షరాక్షరాత్మికా " - అమ్మవారి అద్భుతనామం. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 757 వ నామం.
" క్షరాక్షరాత్మికా " ఒక అద్భుతనామం. క్షర అంటే నాశనమయ్యేది అని అక్షర అంటే నాశనము లేనిది అని సాధారణంగా చెప్పుకునే అర్ధం. కాని ఇక్కడ సంఖ్యలేనన్ని అంటే సంఖ్య " ఇంత " అని తెలుసుకోలేనన్ని అక్షరముల స్వరూపముగలది అమ్మవారు అని అర్ధం చెప్పుకోవాలి.
వేదం చెప్పినవిషయం " ఓం ఇత్యేకాక్షరం (ఇతి+ఏక+అక్షరం ) బ్రహ్మ " - ఓంకారమనే అక్షరమే బ్రహ్మం, ఆ అక్షరాన్నుంచే అన్ని అక్షరాలు జనించాయి అని తెలుసుకోవాలి అని. " అ ఆ....." లకు " అక్షరం అంటే నాశనము లేనిది అని పేరుపెట్టడమే ఒక అద్భుత ప్రక్రియ.
అక్షరం ని అమ్మవారుగా భావించి కొలిచే అద్భుత సంప్రదాయాన్ని మనకు ఇచ్చింది మన సనాతనధర్మం. అక్షరాభ్యాసం దగ్గరనుంచి పిల్లలకు చదువులతల్లి సరస్వతీదేవి ని ఎలా గౌరవించాలో నేర్పించడం, పుస్తకాలను ఎంత జాగ్రత్తగా గౌరవప్రదంగా ఉంచుకోవాలో నేర్పడం కూడా జరుగుతూంది.
అద్భుతవిషయమేమిటంటే ప్రతి అక్షరానికి ఒక అధిస్టానదేవత ఉంటుంది. ఆవిడ ఏ రంగులో ఉంటుందో ఏ వస్త్రం ధరిస్తుందో ఆవిడని ఎలా పూజించాలో ఆవిడకు నైవేద్యం ఏమి సమర్పించాలో ఆ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఈవిషయాలు ఎంత విపులంగా వ్రాసారంటే కొన్ని ప్రసాదాలు చేసేటప్పుడు మంట ఎలా ఉండాలో కూడా చెప్పారు. కొన్నింటికి " మందాగ్ని " అన్నారు అంటే మన స్టౌవ్ ని " స్లిం " లో పెట్టమని చెప్పినట్లుగా. ఎంత అద్భుతం గా గౌరవించారు " అక్షరం " ని.
" ధర్మో రక్షతి రక్షితః " అన్నట్లుగా అక్షరాన్ని మనం గౌరవిస్తే అది మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అమ్మవారు ఓ రెండు బీజాక్షరాలు నాలికమీద వ్రాయగానే పామరుడు కాళిదాసు " మహాకవి " అయారు. నమ్ముకున్నవారిని అలా అనుగ్రహిస్తుంది అమ్మవారు.
అక్షరం ని ఎవరూ దొంగిలించలేరు, పంచుకున్నా తరగదు, గౌరవాన్ని పెంచుతుంది, సమస్యల్లోంచి బయటపడేస్తుంది. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశాలు వృద్ధిపథంలో నడుస్తాయి. సమాజం సన్మార్గంలో నడుస్తుంది.
గురువు శిష్యులందరికీ ఒకే పాఠం ఒకే రకంగా చెబుతారు. మరి కొందరు మొదటితరగతిలో ఉత్తీర్ణులయితే కొందరు సాధారణతరగతిలోనూ, కొందరు ఉత్తీర్ణులు కూడా కాలేకపోవడం జరుగుతూంది ఎందుకని. అమ్మవారి అనుగ్రహం కూడా దీనికి తోడవ్వాలని తెలుసుకోవాలి.
అందరూ చదువుకోవాలి, సమాజం బాగుపడాలి, ప్రజలందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఆ విధంగా అనుగ్రహించమని " అక్షరస్వరూపిణి " అయిన అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment