మందారపువ్వు అంటే తెల్లజిల్లేడు పువ్వు, మనందరం అనుకునే మందారపువ్వు కాదు - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" పాటలీకుసుమప్రియా, మందారకుసుమప్రియా " అమ్మవారి అద్బుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 773, 776 వ నామాలు.
అమ్మవారికి పాటలీకుసుమం అంటే ఇష్టం. పాటలీ అంటే గులాబీరంగు. గులాబీ పువ్వు అనుకోకూడదు. తెల్లవి, పసుపువి ఇప్పుడు నల్లవి కూడా గులాబీలు వస్తున్నాయి కనుక.
దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని కీర్తిస్తాం. అగ్ని/మంట ఎరుపు పసుపూ కలిసిన రంగులో ఉంటుంది అమ్మవారు. ఆ రంగులో ఉన్న పువ్వులన్నీ గులాబీరంగులో ఉన్న పూవులుగా భావించాలి.
అమ్మవారికి " మందారపువ్వు " అన్నా ఇష్టమే. మనకు చిన్నప్పటినుంచీ తెలిసిన విషయం " మందారం అనగానే ముద్దమందారం, రేకమందారం, ఎర్రమందారం, పసుపుమందారం " అని. కాని ఇక్కడ మందారం అంటే " తెల్ల జిల్లేడు పువ్వులు " అంతేకాని మనం సాధారణంగా అనుకుకునే మందారం కాదు. " మందారకుసుమప్రియా " అంటే అమ్మవారికి తెల్లజిల్లేడు పువ్వులంటే ఇష్టమని.
ఒక్కో రహస్యనామానికి అర్ధం తెలుసుకుని వ్రాయడం అంటే ఎన్ని గ్రంధాలు తిరగెయ్యాలి, ఎంత కష్టపడాలి.
శంకరులు బ్రహ్మసూత్రాలకి భాష్యం వ్రాసారు. తరువాత స్వయంగా సరస్వతీదేవి విష్ణుసహస్రానికి భాష్యం వ్రాయమన్నారు శంకరులని. లలితాసహస్రానికి భాష్యం వ్రాయడానికి తరచు అడ్డంకులు వస్తూంటే అమ్మవారిని అనుమతిని ఇవ్వమని అడిగారుట శంకరులు. " దానికి ఇంకో ఆయన వస్తారులే నాయనా " అందిట అమ్మవారు ( బహుశః శంకరులు అప్పటికే సనాతనధర్మపరిరక్షణకోసం దేశమంతా కాలినడకన 3 సార్లు తిరిగి అలసిపోవడం కారణంగా అమ్మవారు అలా అని ఉండవచ్చు ). శంకరుల తరువాత 1000 సం.ల తరువాత జన్మించిన భాస్కరరాయలు వ్రాసారు " సౌభాగ్యరత్నాకరం " - శ్రీలలితాసహస్రంకి భాష్యం. అలా ఏర్పాట్లు చేస్తుంది అమ్మవారు.
అవ్యాజకరుణామూర్తి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment