లలితానామం 799,800 - రసజ్ఞా - సూర్య
🙏" శ్రీమాత్రేనమః " 🙏
" రసజ్ఞా, రసశేవధిః " - అమ్మవారి అద్భుతనామాలు.
శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 799,800వ నామాలు.
" రసజ్ఞా " అంటే రసములగురించి తెలిసినది అని అర్ధమయినా ఆవిడ " రసస్వరూపిణి ". వేదాలు పరమాత్మని " బ్రహ్మానందరస స్వరూపం " అని తెలియచేస్తున్నాయి.
" రసశేవధిః " అంటే " రసములకు గని వంటిది " అని అర్ధం.
రసలక్షణం లోపల ఉంటేనే మనిషికి ఉత్సాహం, ప్రేమ, ఆనందం, ఉల్లాసం ఉంటాయి. రసభావన లేకపోతే ఏదీ ఆనందించలేడు, అందుకే జీవితం వ్యర్ధం అంటారు. నవరసాలు + భక్తి తో కూడిన 10 రసాల సమాహారమే జీవితం. అందుకే తరచుగా ఈ భావన లేని మనిషిని " రసహీనుడు " అంటారు.
మహాకవి కాళిదాసు కూడా విద్వత్సభకి వెళ్ళేటప్పుడు " ప్రేక్షకుల్లో కొందరైనా రసజ్ఞులు ఉండేలా చూడు తల్లీ " అని ప్రార్ధించేవారుట. చాగంటివారైనా, గరికిపాటివారైనా ప్రవచనం చేసినప్పుడు కొందరైనా ఆనందించేవారు, ఆనందం వ్యక్తపరచేవారూ ఉండాలి కదా. ఆ భావన అందరిలోనూ ఉండాలి. అప్పుడే సర్వం ఆనందమయం. ఆ రసభావన ఇచ్చేది అమ్మవారే. మధురమైన ( రస ) సంభాషణ ఎంతటివారినైనా కట్టిపడేస్తుంది.
మా గ్రామవాసి, బంధువు అయిన " పండితరాజ " జగన్నాధపండితులు తన 25వ ఏటే కాశీవిశ్వవిద్యాలయానికి ముఖ్యాధిపతి అయేరు. ఆయన 16వ ఏటకే వేదశాస్త్రాల్లో దిట్ట, ఎందరో పండితులను శాస్త్రవిజ్ఞానంతో ఓడించి ఆ పదవి చేపట్టడం జరిగింది.
ఆయన బాదుషా సంస్థానంలో " న్యాయసభ " కు అధ్యక్షులుగానూ, ముఖ్యపండితుడిగానూ ఉండేవారు. అలా అధ్యక్షపదవిలో ఉండడంతో రాత్రి 7,8 గం.ల వరకూ రాజుతో ఉండవలసి వచ్చేది. రాజు అంతఃపురంలోకి వెళ్ళగానే గుమ్మం దగ్గర సెలవు తీసుకుని ఈయన ఇంటికి వెళ్ళేవారు. అప్పుడు అంతఃపురాల్లో హిజ్రాలు ఉండేవారు. వారు రాజు రాణి గార్ల అంతఃపురాలలో తిరుగుతూ ఉండేవారు. ఒకసారి ఒక హిజ్రా ఈయనతో " ఏమండీ మీరు మహాపండితులే కాని రాజు గారి గది గుమ్మం దగ్గరవరకే రాగలరు. రాణిగారి గది దగ్గరకు రానేలేరు. నేను వారి ఇద్దరి గదుల్లోనూ కూడా హాయిగా తిరగగలను. మన ఇద్దరిలో ఎవరు గొప్పంటారు " అని అడగడంతో ఆయన " రాజుగారి పట్టపు ఏనుగు కోటగుమ్మం దగ్గరకే వస్తుంది, కాని పిల్లి ఇల్లంతా తిరుగుతుంది. ఆ రెండింటిలో ఎవరు గొప్పో నువ్వే ఊహించుకో " అని వెళ్ళిపోయారుట.
రసభరితమైన ( ద్వందార్ధాల/అలంకారాల ) శ్లోకాలు 3000 దాకా వ్రాసారు ఈయన. 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ఈయన అద్భుతకావ్యం " రసగంగాధరం ". విశ్వవిఖ్యాతిగాంచిన ఈ " అలంకార " కావ్యానికి 400 సం లు అయినా ఒక ఖండన కూడా రాలేదు.
ఇటువంటి " రసజ్ఞత " ను అమ్మవారు అనుగ్రహిస్తుంది " రసజ్ఞ " రూపిణిగా.
అందుకని ప్రతీ విషయంలోనూ ఆనందాన్ని చూస్తూ ఇతరులతో ఆ ఆనందాన్ని పంచుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఏమాత్రం కష్టం కాదు అమ్మవారి అనుగ్రహం ఉంటే. రసజ్ఞులందరికీ శుభాకాంక్షలు.
ఈరోజు పవిత్రమయిన " నాగులచవితి ". శ్రీనవనాగమాతా శ్రీమానసాదేవ్యైనమః.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment