లలితానామం 967- జ్వాలాతోరణం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సుమంగళీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రనామాలలో 967వ నామం.

సుమంగళీ అంటే దీర్ఘసుమంగళత్వాన్ని ప్రసాదించేది. " సు + మంగళం " - లోకాలకు శుభములు కలుగచేస్తుంది. అమంగళం అంటే అజ్ఞానం, దాన్ని పోగొడుతుంది.

శుభకార్యం అంటే అశుభాలను తొలగించమని చేసే కార్యం. 

విష్ణుసహస్రంలో పూర్వపీఠికలో పరమాత్మని " పవిత్రాణాం చ పవిత్రం, మంగళానాం చ మంగళం " అని ప్రార్ధిస్తాం. మంగళాలలో కెల్లా మంగళమయినవారు అని.

అమ్మవారు ఎంతటి కరుణామూర్తియో తెలుసుకోవాలంటే " జ్వాలాతోరణం " వెనక ఉన్న కధ చదవాలి.

దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు మొదట హాలాహలం పుట్టింది. దేవతలందరూ భయపడిపోయారు. ఎవరూ దానిదగ్గరకు కూడా రాలేనప్పుడు పరమశివుడు దాని అంతుచూడడానికి ఎదరకు వచ్చారు. అమ్మవారు ఏమీ మాట్లాడలేదు. అమ్మవారికి ఆవిడ సుమంగళత్వం మీద అంత నమ్మకం. దీర్ఘసుమంగళత్వాన్ని అనుగ్రహించే అమ్మవారికి లోటేముంది. 

శివుడు హాలాహలాన్ని నోట్లో వేసుకున్నారు. లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి. స్వామి ఉదరంలో. హాలాహలం ఉదరంలోకి వెడితే ఏమవుతుంది, లోకాలన్నీ మసి అయిపోయి ప్రాణులన్నీ నశిస్తాయి. మరి ఎలా?.

అప్పుడు అమ్మవారు ఏవిధమయిన కీడు జరగకూడదని " తాను నిప్పులలో నడుస్తాను " అని మ్రొక్కుకుంది. లోకాలు, ప్రాణులు సుఖంగా ఉండాలని తను నిప్పులలో నడవడానికి సిద్ధపడ్డారు. అవ్యాజకరుణామూర్తి.

గరళం స్వామి కంఠంలో నిలిచింది, బయట లోపల ఉన్న ప్రాణులకు ఏ బాధాలేకుండా.

అదే ఇప్పుడు కార్తీకపౌర్ణమినాడు మనం చేసుకునే " జ్వాలాతోరణం ". అమ్మవారు స్వామితో కలిసి మ్రొక్కు తీర్చుకోవడానికి జ్వాలాతోరణం క్రిందనుంచి వెడుతూంటే అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటూ భక్తులు కూడా " హరోంహరా " అని ఎలుగెత్తి ఘోషిస్తూ అమ్మవారి వెనుక పరుగెడతారు.

ఈరోజు పరమపవిత్రమయిన కార్తీకపౌర్ణమి, జ్వాలాతోరణం. అమ్మవారిని స్మరించుకుని ఆవిడ అనుగ్రహానికి పాత్రులవుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ