శ్రీశ్రీశ్రీభారతీతీర్థమహాస్వాముల పట్టాభిషేక శుభదినోత్సవం. - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
భాగ్యనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్రిందటేడాది జరిగిన శ్రీశంకరజయంతి వేడుకలు సందర్భంగా శ్రీశృంగేరీ ఉత్తరపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీమహాస్వామి వారు అనుగ్రహభాషణం చేసారు. అద్భుతమైన విషయాలు తెలియచేసారు.
" జంతూనాం నరజన్మ దుర్లభం " అన్నారు. 84 లక్షల జీవరాసుల్లో మనిషే బుద్ధిజీవి. ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకువెళ్ళేదే జ్ఞానమార్గం. ఈ జ్ఞానాన్ని కలుగచేసేవే వేదాలు. అవి ఏమిచెయ్యలో కాదు, ఎలా చెయ్యాలో కూడా తెలియచేసాయి. ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా నడుచుకోవాలో కూడా తెలియచేసాయి. ఎంతటి అద్భుత సంపద.
కంటితో చూస్తాం, చెవితో వింటాం. ఎన్నియుగాలయినా అదే సత్యం. వేదాలు చెప్పేవి కూడా అటువంటి విషయాలే. గురువు ముఖ్యలక్షణం ఏమిటంటే శిష్యుడి సమర్ధత యోగ్యతను బట్టి చదువు చెప్పడం. మరి వేదాలు అందరూ నేర్చుకోగలరా?.
వేదాల్లో " తస్య ప్రతిమ నాస్తి " అని ఉంది. ఇక్కడ ప్రతిమ అంటే విగ్రహం అని అనుకుని కొందరు అతనికి ( దేవుడికి ) విగ్రహం లేదు అని వేదాలే చెపుతున్నాయి కదా మరి విగ్రహారాధన ఏమిటీ అంటున్నారు. కాని ప్రతిమ అంటే " ఉపమానం/పోలిక " అని అర్ధం. అంటే దేవుడికి సమానమైనది లేదు అని అర్ధం. ఇదే విషయాన్ని భ.గీతలో విశ్వరూపసందర్శనం తరువాత అర్జునుడు అంటాడు " పరమాత్మా నీకు సమానమైన వాడు లేడు " అని. సమానమయిన వాడే లేడంటే అతనికన్నా గొప్పవాడు ఎలా ఉంటాడు. ఇలా సహం సహం చదివి అర్ధాలు చెప్పేస్తున్నారు కొందరు అన్నారు.
సనాతనధర్మం ముఖ్యోద్దేశ్యం ధర్మప్రచారం. " సత్యం వద, ధర్మం చర " దాని ఆత్మ. ఈ ధర్మ ప్రచారం శాశ్వతంగా ఉండాలనే 4 పీఠాలను ఏర్పాటుచేసారు ఆదిశంకరులు.
12వ పీఠాధిపతి శ్రీవిద్యారణ్యమహాస్వామియే విజయనగరసామ్రాజ్య స్థాపన చేసారు. ప్రస్థుత పీఠాధిపతి 36వ మహాస్వామి.
" నేను ఆస్తికులకి ( నాస్తికులకు కాదు ) చెప్పేదేమిటంటే - వేదాలను గౌరవించండి, మంచిమార్గంలో నడవండి, ఎవరికీ అపకారం చెయ్యకండి, వేదాలలో ఏమయినా సంశయాలు ఉంటే నివృత్తి చెయ్యడానికి మా పీఠం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, అందరికీ శుభాశీస్సులు " అని ముగించారు.
చిన్నపిల్లవాడికి అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు విషయాలని. ఎంతటి అద్భుత విద్వత్తు.
ఈరోజు శ్రీశృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీభారతీతీర్థమహాస్వాముల పట్టాభిషేక శుభదినోత్సవం. అందరికీ శుభాకాంక్షలు.
సర్వే జనాః సుఖినో భవంతు.
ఎతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment