కార్తీకమాసం పవిత్రత - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
పురాణాలు, ఉపనిషత్తులు మనకు ఋషులు ఇచ్చిన అద్భుత సంపద. చిన్నచిన్న కధలతో మనకు, మానవాళికి, ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో చక్కగా తెలియచేయబడ్డాయి.
కార్తీకపురాణం లో ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. ఒక సందర్భంలో సరస్వతీదేవి గాయత్రీదేవిని ఉద్దేశించి ఇలా అంటారు:
" అపూజ్యా యత్రపూజ్యంతే
పూజ్యానాంచ వ్యతిక్రమః,
త్రీణిత్రత్ర భవిష్యంతి
దుర్భిక్ష్యం మరణం భయం ".
" ఎక్కడైతే పూజార్హతలేనివారు పూజింపబడుతూ ఉంటారో, పూజనీయులు పూజింపబడడంలేదో అక్కడ కరువు, మరణం, భయం అనే మూడు విపత్తులు కలుగుతాయి " అని.
ఇప్పుడు పూజార్హతలేనివారికి కూడా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అందువల్లే ఈ విపత్తులన్నీ అని అనుకోవచ్చు.
ఈ పురాణంలోనే కృష్ణపరమాత్మ సత్యభామతో ఇలా అంటారు:
" దేశగ్రామకులానిస్యుః
భోగభాంజికేతాదిషు,
కలౌతు కేవలం కర్తా
ఫలభుక్పుణ్యపాపయోః ".
అంటే " కృతయుగంలో పాపపుణ్యాలు ఎవరు చేసినా గ్రామానికి చెందేవి. ద్వాపరంలో వారి వంశానికి చెందేవి. కలియుగంలో మాత్రం ఎవరి కర్మఫలాలు వారికే చెందుతాయి " అని.
స్వామి ఎన్నో అద్భుతమైన ఇతర విషయాలు కూడా తెలియచేసారు. పుణ్యమైనా పాపమైనా స్వయంగానే చెయ్యక్కరలేదు. అలాంటి విషయాలలో పాలుపంచుకున్నా , ప్రమేయమున్నా కొంత ఫలం అలాంటివారికి దక్కుతుంది. ఒకాయన అన్నదానం చేసేరనుకుందాం. ఆయనకు ఎలాగూ పుణ్యం వస్తుంది. కాని ఆ పుణ్యంలో కొంత కొంత భాగం అన్నం వండినవారికి ఆకులు వేసినవారికి వడ్డించినవారికి చివరికి ఎంగిలి ఆకులు తీసేవారికి అందరికీ కూడా కలుగుతుంది.
భీష్ముడు సర్వశాస్త్రపారంగతుడు, ఎన్నో ధర్మసూక్ష్మాలని తెలియచేసాడు ధర్మరాజుద్వారా, పరమపవిత్రమైన " విష్ణుసహస్రం " ని లోకానికి ప్రసాదించాడు. కాని ఒకేఒక్కకారణం, నిండుసభలో ద్రౌపది అవమానింపబడుతున్నప్పుడు మౌనంగా ఉండడం, వల్ల మరణాన్ని పొందాడు. అదే అశ్వద్ధామ " అది తప్పు " అని చెప్పి సభనుంచి నిష్క్రమించి " చిరంజీవి " అయాడు.
ఒక్కొక్క కౌరవుడు చంపబడినప్పుడు పాండవులు విజయగర్వంతో ఆనందించారు. కాని వికర్ణుడిని చంపి భీముడు వలవలా ఏడుస్తాడు " నాయనా నిన్ను ఇలా చంపవలసి వచ్చిందా, యుద్ధంలో అటుప్రక్క ఉండడం వల్లకదా న్యాయానికి అండగా నిలిచినా నిన్ను చంపవలసి వచ్చింది " అని. ఒక్క వికర్ణుడే సభలో " ద్రౌపదిని అవమానించడం తప్పు " అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.
అందుకే " సత్సాంగత్యం " కలిగి ఉండాలంటారు. మంచికార్యక్రమాల్లో పాల్గొన్నా, చూసినా, పెద్దలు పండితులు చెప్పే నాలుగు మంచిమాటలు విన్నా కూడా కొంచెం పుణ్యభాగం దక్కుతుంది అని పురాణాలు తెలియచేస్తున్నాయి. నాస్తి సంశయం.
*రేపటినుంచి పవిత్రమయిన కార్తీకమాసం. శివకేశవులకు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. శివకేశవుల నామజపం చేసుకుని తరిద్దాం.*
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment