శతమానం భవతి - సూర్య
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
ఆదిశంకరులు శివానందలహరి చేస్తూ ఇలా ప్రార్ధించారు:
" పాపోత్పాత విమోచనాయ
రుచిరైశ్వర్యాయ
మృత్యుంజయ
స్తోత్రధ్యాన నతిప్రదక్షిణ
సపర్యాలోకనాకర్ణనే |
జిహ్వాచిత్త శిరోరంఘ్రి
హస్తనయన శ్రోత్రైరహం
ప్రార్థితో మామాజ్ఞాపయ
తన్నిరూపయ
ముహుర్మామేవ
మా మేఽవచః " ||
ఓ మృత్యుంజయా, పాపములు నశించి కోరిన కోరికలు నెరవేరుటకు నిన్ను ప్రార్ధించుమని నాలుక, ధ్యానం చేయమని మనస్సు, నమస్కరింపుమని శిరస్సు, ప్రదక్షిణము చేయుమని పాదములు, పూజింపుమని చేతులు, చూడుమని కన్నులు, నీలీలలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి. నీ అనుగ్రహంలేనిదే నాకు అదెలా సాధ్యము. అనుగ్రహం ప్రసాదించడమే కాకుండా మూగ, కుంటి, గ్రుడ్డి, మందమతిత్వము మొదలైన లోపములు నాకు కలుగకుండా చూడు స్వామీ.
ఏలోపాలూ లేని చక్కటి ఆరోగ్యాన్నిచ్చి నిన్ను సేవించుకునేలా చెయ్యమని ఎంత లౌక్యంగా ప్రార్ధన చేసారో శంకరులు.
వేదంలో ఆశీర్వచనం ఇలా చేయమని ఉంది:
" పశ్యేమ శరదశ్శతం,
శృణువామ శరదశ్శతం,
జీవేమ శరదశ్శతం,
భవామ శరదశ్శతం "
100 సం.లు ఆనందంగా చూడాలి, ఆనందంగా వినాలి, ఆనందంగా జీవించాలి. ఇదే శతమానం భవతి అనే ఆశీర్వచనం.
అధర్వణవేదంలో " ఏ క్షేత్రే అనమీవా విరాజా " అనే ప్రార్ధన ఉంది. అంటే " తమతమ క్షేత్రములయందు ఏరోగములు లేనివారై మనుషులు ఉండాలి " అని. ఎంతటి అద్భుత వాజ్మయం.
సనాతనధర్మం అంతా " సాత్వికంగా " ఉండాలి అని చెబుతూంది. అంటే ఆహారం, నడవడిక, ఆలోచన అన్నీ సాత్వికంగా ఉంటే శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి.
అంత సూటిగా, సందేహరహితంగా చెబుతుంది సనాతనధర్మం ఏవిషయమైనా. అందుకే మన సనాతనధర్మానికి సాటి ఏదీలేదు, రాదు.
అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆనందంగా గడిపేలా అనుగ్రహించమని కోరుకుందాం పరమేశ్వరుడిని.
ఏతత్ సర్వం శ్రీశివార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment