శ్రీశంకరులు - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" న మంత్రం నో యంత్రం
తదపి చ న జానే
స్తుతిమహో, నచాహ్వానం
ధ్యానం తదపి చ న జానే
స్తుతికధాః, న జానే ముద్రాస్తే
తదపి చ న జానే విలపనం,
పరం జానే
మాతస్త్వదనుసరణం
క్లేశహరణం "
పూజ్యులు శంకరాచార్యులు " దేవీ అపరాధ క్షమా స్తోత్రం " చేస్తూ ఇలా అన్నారు - " అమ్మా నాకు నీ మంత్రం , యంత్రం తెలియదు, ఎలా స్తుతించాలో తెలియదు , నీ ముద్రలు తెలియవు, నిన్ను చేరేందుకు ధ్యానం( మెడిటేషన్ ) ఎలాచేయాలో తెలియదు , చివరకు ఏడవడం కూడా తెలియదు కానీ ఒకటిమాత్రం తెలుసుకున్నాను, నిన్ను అనుసరిస్తే ( నీ ఎరుక కలిగి ఉంటే ) చాలు నా కష్టాలన్నీ తొలగిపోతాయి " అని.
అంతటి మహానుభావుడు తను ఏమీ తెలియని అమాయకుడినన్నారు. దేశంలో 4 దిక్కులా పీఠాలు ఏర్పరిచారు, ఎన్నో శక్తిపీఠాల్లో ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపచేయడానికి గుడులలో యంత్రప్రతిష్ఠ చేసారు. మదురమీనాక్షి కూడా ఒకప్పుడు ఉగ్రంగా ఉండి అర్ధరాత్రి ఊళ్ళో తిరుగుతూ జనాలని సంహరించేదిట. కొన్నిరోజులు గుడిలోనే ఉండిపోయి ఆవిణ్ణి స్తోత్రాలతో సంతోషపరిచి ఆవిడ అనుమతితో యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతపరిచారుట.
మన యొక్క, దేశం యొక్క అదృష్టమేమిటంటే ఆయన తన పుట్టిన ఊరు కాలడిలో ముక్కుమూసుకుని నాకెందుకొచ్చిన గొడవ అని కూర్చోలేదు ఇప్పటి మేధావుల్లా. కాలినడకన దేశమంతా 3 సార్లు తిరిగి, అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎక్కడెక్కడ సనాతనధర్మానికి హాని జరుగుతూందో/జరిగే అవకాశముందో అక్కడ పండితులతో వాదించి వారిని ఓడించి ఒప్పించి ధర్మసంస్థాపన చేసారు.
మందనమిశ్రా తో వాదించి ఓడించాక ఆయన భార్య " ఉదయభారతి " తనని కూడా ఓడిస్తేనే శంకరులు గెలిచినట్లు అని అనడంతో ఆవిడని కూడా ఓడించారు. స్త్రీకదా అని తప్పుకోలేదు.
సామాన్యులు కూడా తక్కువశ్రమతో ఎక్కువగా భగవద్కృపకు పాత్రులవడంకోసం సౌందర్యలహరి, శివానందలహరి, పంచకాలు, అష్టకాలు భజగోవిందంలను ప్రసాదించారు. పండితుల సౌలభ్యంకోసం బ్రహ్మసూత్రాలకు, విష్ణుసహస్రానికి భాష్యాలు రచించారు.
ఆయన చేసిన అద్భుత కృషివల్లే వెయ్యిఏళ్ళు పైబడి పరాయిపాలనలో ఎందరో భ్రష్టుపట్టించాలని చూసినా సనాతనధర్మం చెక్కుచెదరలేదు, నేటికీ నిత్యనూతనంగా ( సనాత్ + అన - సనాత్ అంటే నిత్యనూతనం ) ఉంది.
మతం అంటే అభిప్రాయం అని అర్ధం. మన ఋషుల అభిప్రాయమే అత్యుత్తమం. ఏ మతంలోనూ " వసుధైక కుటుంబం(కం), సర్వే జనాః సుఖినో భవంతు, తన్మే మనః శివసంకల్పమస్తు " లాంటివి ఉండవు. మనది ధర్మాచరణ.
పుండు చిన్నదే కదా అని అశ్రద్ధచెయ్యకూడదు, తరువాత ఆ అవయవం తీసేయవలసి రావచ్చు. ప్రాణమే పోవచ్చు.
జన్మనిచ్చిన తల్లిని, దేశాన్ని, మనధర్మాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా కించపరిచినా ఊరుకోనక్కరలేదు. ఎక్కడికక్కడ ఖండిస్తూ శంకరాచార్యుల స్ఫూర్తితో ఎదరకు పోవడమే ఇప్పుడు అందరం చెయ్యవలసినది.
" ధర్మో రక్షతి రక్షితః "- సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment