క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు - సూర్య

 🙏" శ్రీమాత్రేనమః "🙏

శ్రీలలితాసహస్రం, శ్రీవిష్ణుసహస్రం నామాలు అనుష్టుప్ ఛందస్సులో చెప్పబడ్డాయి/వ్రాయబడ్డాయి. 4 పంక్తుల శ్లోకమైతే పంక్తిలో 8 అక్షరాలు 2 పంక్తుల శ్లోకం లో అయితే పంక్తిలో 16 అక్షరాలు ఉంటాయి. కాని కొన్ని పదాలు వచ్చినప్పుడు ఒక అక్షరం ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు " అ " కి బదులుగా " 2 " ( ప్రింటింగులో అదే వాడుతున్నారు ) గుర్తు వేస్తారు. 8 అక్షరాలే ఉంటాయి కాని ఉచ్ఛారణలో " అ " వినబడేలా ఉండాలి.

ఉదా: ప్రద్యుమ్నో2మితవిక్రమః, క్షేత్రజ్ఞో2క్షర, సోమసో2మృతపః, పద్మనాభో2మరప్రభుః, సంకర్షణో2చ్యుతః మొగు నవి.

" ప్రద్యుమ్నో అమితవిక్రమః " అని చదవాలి, ప్రద్యుమ్నో మితవిక్రమః అని కాకుండా. స్వామి మితవిక్రముడు కాదు, అమితవిక్రముడు. అలాగే ఆయన అక్షర అంటే క్షర/నాశనము లేనివాడు. 

ఎక్కువగా ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారు పారాయణం చేసిన విష్ణుసహస్రమే వింటూంటాం ( భక్తి, ఎస్ వి బి సి టి వి లలో). వందలసార్లు విన్నా ఎప్పుడూ ఆవిడ " పద్మనాభో మరప్రభుః " అన్నట్లే అనిపిస్తుంది ఎంత జాగ్రత్తగా విన్నా. 

మొన్న సామవేదం వారి ప్రవచనం వినడం జరిగింది. ఆయన ఒక అద్భుతవిషయం చెప్పారు. ఒక భక్తుడు అనంతపద్మనాభస్వామి గుడి ముందు కూర్చుని " పద్మనాభో మరప్రభుః, .పద్మనాభో మరప్రభుః, ......." అంటూ గట్టిగా పారాయణ చేస్తున్నాడుట. ఒక పండితుడు గుడిలోకి వెడుతూ ఇతనికి " పద్మనాభో అమరప్రభుః " అనాలి, " మరప్రభుః " అనకూడదు, అది తప్పు " అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడుట.

ఆ రాత్రి విష్ణుమూర్తి ఆ పండితుడి కలలోకి వచ్చి " అలా చెప్పేసావేమిటి ఆ భక్తుడికి. నేను అమరులకే ( దేవతలకే ) ప్రభువునా, మరులకి ( అంటే మరణం ఉన్న మనలాంటివారికి ) ప్రభువును కానా " అనడంతో పండితుడు ఉలిక్కిపడి లేచి తప్పైపోయిందనుకుని లెంపలు వేసుకున్నాడుట.

ఓసారి ప్రవచనం చేస్తూ పూజ్యులు గరికిపాటివారు " విష్ణుసహస్రంలో 2 పాదాలలో మాత్రం 8 కాకుండా 9 అక్షరాలు వచ్చాయి. ఎన్ని గ్రంధాలు వెతికినా కారణం తెలియలేదు " అన్నారు.

ఓ సారి పూజ్యులు మైలవరపు శ్రీనివాసరావు గారు " ఇవన్నీ వేల సంవత్సరాలక్రితం వ్రాసినవి, పరంపరగా వస్తూన్నవి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు " అని చెప్పడం జరిగింది. 

ఈ రెండూ విన్నాక నాకు అనిపించింది " విష్ణుసహస్రానికి భాష్యం వ్రాసినది శంకరాచార్యులు. వ్రాయమని అడిగినవారు సాక్షాత్తూ సరస్వతీదేవి. మరి వారు 9 అక్షరాలను అలాగే మార్చకుండా ఉంచేసారు కదా. తప్పుకాదేమో " అని.

చదువుకోవడం, తప్పులు ఒప్పులుగా చేసుకోమని కోరుకుంటూ " యదక్షర పదభ్రష్టం.......నారాయణ నమోస్తుతే " అనే శ్లోకం చదివి దండం పెట్టుకోవడం మంచిది.

భక్తుల తప్పులను కూడా ఒప్పులుగా స్వీకరించి అనుగ్రహిస్తాడు స్వామి. సంకల్పం మంచిది అయి ఉండాలి అంతే. సంశయం నాస్తి.

ఈరోజు పరమపవిత్రమయిన " క్షీరాబ్ది ద్వాదశి ". శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామినే నమః. 

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ