శ్రీశంకరజయంతి - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
శ్రీశంకరాచార్యుల జయంతోత్సవాలలో వేదపండితులు ప్రవచనం చేస్తూ కొన్ని అద్భుతవిషయాలు తెలియచేసారు.
ఒకసారి వివిధ మతాలగురించి కొందరు నాస్తికులు ప్రస్తావన తెస్తే ఓ వేదపండితుడు అన్నారు " వేరే మతగ్రంధాల్లో దంతధావన గురించి ఉందా " అని. వారు ఆశ్చర్యపోయి " అదేమిటి " అంటే ఈయన " మా వేదాల్లో ఉదయం ఎన్నింటికి లేవాలి, దంతధావనం వేటితో ఎప్పుడు ఎందుకు ఎలా చేసుకోవాలి, స్నానం ఎన్నింటికి ఎలా ఎందుకుచెయ్యాలో, భోజనం ఎప్పుడు ఎలా ఎందుకు చెయ్యాలో స్ఫష్టంగా ఉంది. మావేదాలు జీవనవిధానం తెలుపుతాయి. ధర్మాచరణ చెయ్యడానికి శారీరక ఆరోగ్యం ముఖ్యం కనుక ఆ విషయాలు కూడా తెలియచేసాయి. వేరేమత గ్రంధాల్లో ఇలాంటివి ఉన్నాయా " అని అడగడంతో వాదన అక్కడితో ముగిసిందిట.
ఎంతటి అద్భుత విషయం.
యజుర్వేదం/అధర్వణవేదాల్లో అధికసంపద కోసం చేసే యాగం ఉంది. కోరికలు తప్పుకాదు. వివిధరకాలైన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా చాలా కార్యక్రమాలు తెలియచేసాయి మన శాస్త్రాలు. ఈ యాగంలో చివరన " సంపదను చేతిలో ఉంచు " అని కోరడం ఉందిట. " ఎవరి చేతిలో ఉంచాలి, ఎందుకు నా చేతిలో ఉంచు అని అనలేదు " అనే సందేహం వచ్చిందిట చదివిన వారికి. " పాహిమాం - నన్ను రక్షించు, దేహిమాం - నాకు ప్రసాదించు " అని ఉంటాయి కదా, ఆ మంత్రం లో అలా లేదేమిటి అన్నది సందేహం.
శృంగేరీపీఠం 12వ పీఠాధిపతి శ్రీశ్రీ విద్యారణ్యస్వాముల వారు ఈ సందేహాన్ని తీర్చారు. ఏమని అంటే " నీ " అని తీసుకోవాలి అందుకే " నా " అని చేర్చలేదు అని. అదేమిటండీ యాగం చేసినాయన సంపదని దేవుడు చేతిలో ఉంచమనడం ఏమిటి అంటే స్వామి అన్నది " నీ చెయ్యి, దోసిలి ఎంత ఉంటుంది, 100 కాసులు కూడా పట్టవు " అదే పరమాత్మ అయితే " సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్....... " - సహస్ర అంటే వెయ్యి కాదు అనేకం అని - పరమాత్మ అనేకమయిన చేతుల్లో సంపదను ఉంచేస్తే ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఇస్తూంటారు అని.
ఎంతటి మేధోసంపత్తి,అద్భుత భావన, సందేహ నివృత్తి.
ఈవిధంగా ఎందరో మహానుభావులు తమ మేధస్సుతో వేదాలకి ఉపనిషత్తులకి బ్రహ్మసూత్రాలకి భాష్యాలు వ్రాసారు. నమ్మకంతో వాటిని గౌరవిస్తూ ఆచరణచేస్తూ ముందుకు పోవడమే ఇప్పుడు మనమందరం చెయ్యవలసినది.
సర్వే జనాః సుఖినో భవంతు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment