హీరో - జీరో - మహాభారతం - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏


" ఏవం బుద్ధిశ్చ తేజశ్చ 

  ప్రతిపత్తిశ్చ భారత, 

  భవంతి భవకాలేషు 

  విపద్యంతే విపర్యయే " 

పై శ్లోకం మహాభారతంలోనిది.

వ్యాసమహర్షి అంటారు అర్జునుడితో " ఇవే బుద్ధి, తేజస్సు , ఇతర శక్తులు అంటే ఆయుధాలు, ధైర్యం, ఉపాయాలు, చురుకైన మనస్సు వంటివి అన్నీ ఉంటాయి కాని - కాలం కలిసివచ్చినప్పుడు రాణిస్తాయి, కాలం కలిసి కలిసిరానప్పుడు ఏవీ పనికిరాకుండా పోతాయి " అని.

శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారం ద్వారకలోని స్త్రీలని, పిల్లలని వెంటపెట్టుకుని హస్తినకు బయలుదేరుతాడు అర్జునుడు. దారిలో బందిపోటుదొంగలు అడ్డగించి నగలని దోచుకుంటారు, స్త్రీలని ఎత్తుకుపోతూంటారు. అర్జునుడికి ఒక్క మంత్రం జ్ఞాపకానికి రాదు, ఒక్క బాణం కూడా వెయ్యలేకపోతాడు. దొంగలు హేళన చేస్తారు, నవ్వుతారు అర్జునుడి పరిస్థితి చూసి.

మిగిలినవారితో హస్తినకు వచ్చిన తరువాత అర్జునుడు వ్యాసుల వారి కాళ్ళపై పడి భోరున ఏడ్చి తనకీ దుర్గతి ఏమిటీ అన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. 5000 ( కనీసం అందరూ అనుకుంటూన్నట్లుగా ) ఏళ్ళక్రితం చెప్పినవి, ఇప్పటికీ నిత్యసత్యాలు.

ఇలాంటివి ఎన్నో తరచూ చూస్తూంటాం, వింటూంటాం. కాలం కలిసివస్తే హీరో, కలిసిరాకపోతే జీరో.

ఓ నాయకుడు ఉంటాడు. అద్భుతమైన పాలన చేస్తాడు. దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకుంటాడు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాడు. దేశ రాజకీయాలు ఆయన కనుసన్నల్లో నడుస్తాయి. అదే నాయకుడు తరువాత కాలంలో నానా కష్టాలు పడతాడు. కాలం కలిసి రాకపోతే ఎవరయినా ఇంతే.

పూజ్యులు రమణమహర్షి తరచు అంటూండేవారుట - " కొన్నిపనులు ఎంతో చిన్నవి అయినా ఎంత కష్టపడినా అవవు. కొన్ని కష్టమైనపనులు అవవు అని నిర్ణయానికి వచ్చేసినా ఆశ్చర్యకరంగా నిజమేనా అనిపించేలా సులువుగా అయిపోతూంటాయి " అని.

" అనుకున్నామని జరగవు    

         ‌ ‌     అన్నీ, 

  అనుకోలేదని ఆగవు కొన్ని, 

  జరిగేదంతా మంచికని, 

  అనుకోవడమే మనిషి పని " 

                    - ఓ సినీకవి 

అదీ మన సనాతనధర్మం గొప్పదనం. అలా ఆలోచనచేస్తే మనశ్శాంతిని సులువుగా పొందవచ్చు. అటువంటివారు స్థితప్రజ్ఞులు అని అనుకోవచ్చు.

ఈరోజు " ఏకాదశి ( ఉపవాసం ) "' శుభదినం.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ