భగవద్గీత - 11:25 - ధర్మహానికి శిక్ష - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" దంష్ట్రాకరాళాని చ
తేముఖాని,
దృష్టైవ కాలానల సన్నిభాని,
దిశో న జానే న లభే చ శర్మ,
ప్రసీద దేవేశ జగన్నివాస "
- భగీ 11:25
పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవాడు, పాశుపతాస్త్రాన్ని పొందినవాడు అయిన అర్జునుడే. పరమాత్మ విశ్వరూపాన్ని చూసి భయపడిపోయి " నీ నోర్లు, కోరలు చూస్తూంటే భయంగా ఉంది, దయచేసి వెంటనే ఉపసంహరించు నీ విశ్వరూపాన్ని " అని వేడుకున్నాడు.
మంచివారిని రక్షించడానికే కాదు, చెడ్డవారిని శిక్షించడానికి కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటానన్నారు పరమాత్మ.
సనాతనధర్మం అంత మెత్తనయినది కాదు, ఓ చెంపమీద కొడితే ఇంకోచెంప చూపెట్టు అనలేదు, అనబోదు.
వేదాలలో " అభిచారమంత్రాలు " అని ఉన్నాయి. ధర్మానికి ఎవరయినా విపరీతమైన హాని చేస్తూన్నప్పుడు అతని నాశనాన్ని కోరుతూ ఈ నామాలతో హోమం చేస్తారు.
ధర్మం పాటిస్తూన్నంతసేపే అమ్మవారు అవ్యాజకరుణామూర్తి. కొద్దిగా ప్రక్కకు జరిగినా ఛండికయే. ఆవిడ ఛండశాసన. ఆవిడ శాసనాలను అతిక్రమిస్తే ఇంతే సంగతులు, దహనానికి అవయవాలు కూడా దొరకవు.
ఇది జీవులకే కాదు, దేవతలకు కూడా తప్పదు. పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసింది, క్షణమే. కాని ఆ చిన్నసమయంకే సృష్టి అంతా ఓ కుదుపుకు లోనయింది. శివుడు ఆగ్రహంతో " పోయి తపస్సుచేసుకుని ప్రక్షాళన చేసుకో " అని కోప్పడ్డారు.
వచ్చి కాంచీపురంలో తపస్సుచేసి కామాక్షీదేవి అయింది. తపస్సు చేస్తూన్నా వదిలేరా స్వామి, లేదు భయంకరమయిన నీటిప్రవాహాన్ని పంపారు. ఆవిడ దుర్గని పంపి ఔపాసన పట్టించేసింది తెలియక. వెంటనే ఇంకా ఉధృతంగా ప్రవాహం వచ్చింది. అప్పుడు తెలుసుకుంది, అది శివుడి ఆగ్రహం అని. వెంటనే శివలింగాన్ని కౌగలించుకుని " కంప, కంప - రక్షించండి " అంది. ఆ ప్రవాహమే " కంపానది " అయింది.
ధర్మాన్ని విస్మరిస్తే మెత్తగా ఉండవు శిక్షలు.
భూకంపాలయినా, సునామీలయినా, వైరస్సయినా, అణుబాంబు అయినా అమ్మవారికి కోపంవస్తేనే వస్తాయి. అమ్మవారికి కోపం వచ్చే పనులు చేయకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి.
ధర్మో రక్షతి రక్షితః.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయత్
Comments
Post a Comment