భగవద్గీత - 18:60 - అహంభావం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 

" స్వభావజేన కౌంతేయ 

  నిబద్ధః స్వేన కర్మణా, 

  కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ 

  కరిష్యస్యవశో2పి తత్ " 

                  - భ.గీ 18:60.

" నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి 

చేయుదువు " అన్నారు పరమాత్మ.

మనల్ని మనలా ఉండనివ్వదు సమాజం. పరిస్థితుల ప్రభావానికి లోనై జీవుడు తను చేయాలని అనుకోని, చేయకూడని పనులు కూడా చేస్తూంటాడు. ఆవేశంలో చేసే ఎన్నో ఘోరాలు తరచుగా చూస్తూంటాం.

" అరుణి " అని ఒక మహర్షి ఉండేవారు. వేదపండితుడు. గురుకులం నడిపేవారు. అక్కడ కహోడ అనే శిష్యుడు ఉండేవాడు. వేదాలను ఔపోసన పట్టేసాడు. మహర్షి తనకూతురు సుజాతని కహోడాకి ఇచ్చి వివాహం చేసారు, తన తరువాత గురుకులం చూసుకుంటాడు అని కూడా అనుకుని.

సుజాత గర్భం దాల్చింది. ఓ రోజు కహోడగారు వేదం వల్లెవేయిస్తున్నారు శిష్యులతో. సుజాత ఆ ప్రక్కనే కూర్చుని ఏదో పనిచేసుకుంటూంది. సుజాత కడుపులోని శిశువు " నాన్నగారు ఈరోజు మీ పారాయణ దోషభూయిష్టంగా ఉంది, 8 తప్పులు దొర్లాయి " అనడంతో ఆయనకు కోపం వచ్చి " నువ్వు నన్నే తప్పుపడతావా, 8 వంకర్లతో పుడతావు " అని శపించాడు. ఆ కుర్రాడే " అష్టావక్రుడు ", మహా పండితుడు. అష్టావక్రగీతను ప్రసాదించాడు.

చదువుకున్నంత మాత్రాన " వివేకం " ఉంటుందనుకోకూడదు. సమాజం, పరిస్థితులు వివేకాన్ని పోగొట్టి అవివేకంలో ముంచుతాయి.

ఆకాలంలో మహర్షులు తమకు శిష్యులకు గురుకులానికి కావలసిన అవసరాలకోసం రాజుని కలిసి అడిగేవారు. ఈ కోహడగారు అలా ఓసారి వెళ్ళినప్పుడు రాజు ఓ సమస్య ఇచ్చి పూరించినవారికి అఖిలసంపదలు ఇవ్వడం, ఓడిపోతే జీవితకాలశిక్షను అనుభవించేలా చాటింపు వెయ్యడం, ఎందరో పండితులు ఓడిపోయి శిక్షలు అనుభవిస్తూ ఉండడం విన్నారు ఈయన. మహాపండితుడు, మనకెందుకు అనుకోలేదు. తనూ ప్రయత్నించి ఓడిపోయారు. తరువాత కాలంలో అష్టావక్రులు తల్లిద్వారా విషయం తెలుసుకుని వెళ్ళి రాజు సమస్యను పూరించి తన తండ్రిని ఎందరో పండితులను శిక్షనుండి తప్పించారు.

అందరూ చదువుకున్నవారే. ఎంతో నిగ్రహంతో ఉందాం అనుకుంటారు. ఎక్కడ కుదురుతుంది. కాలం బాగుండనప్పుడు వివేకాన్ని " అవివేకం " కమ్మేస్తుంది. అహంతో బురదలో కూరుకుపోతూంటారు.

అటువంటి " మాయ " లో పడకుండా ఉండాలంటే అమ్మవారి పాదాలే శరణ్యం.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ