2వ భాగము - " సంస్కృతి-సంస్కృతం " - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సంస్కృతి-సంస్కృతం " - 2
మన సనాతనధర్మం మన సంస్కృతి మన సంస్కృతభాష గొప్పదనం గురించి ఓ సారి నెమరు వేసుకుందాం.
ఏ దేశ సంస్కృతి అయినా ఆ ప్రజలమనస్సులకు ఉత్తమ సంస్కారాలు అనగా " పరోపకారం, మానవసేవ " వంటి ఉదారభావాలు కలిగించి వారి జీవితధ్యేయాలను ఉత్తమలక్ష్యాలు కలవానివిగా తీర్చిదిద్ది తోటిదేశాలకు నైతిక వైజ్ఞానిక ధార్మిక బిక్ష పెట్టగలిగి ఉండాలి. ఇటువంటి సంస్కృతికి పుట్టినిల్లు మన అమృతభాష " సంస్కృతం ".
సంస్కృతభాషా లక్ష్యం ఎంతటి ఉన్నత భావాలు కలదో ఈ క్రింది శ్లోకాలద్వారా గ్రహించవచ్చు.
5000 ( కనీసం ) ఏళ్ళక్రితం భగవద్గీతలో పరమాత్మ చెప్పినది:
" విద్యావినయ సంపన్నే,
బ్రాహ్మణే గవి హస్తిని,
శునిచైవ శ్వపాకేచ,
పండితాః సమదర్శినః "
- భ.గీత 5:18
" విద్య వినయాలు ఉన్నవారు బ్రాహ్మణుణ్ణి ఆవుని ఏనుగుని కుక్కను కుక్కనుతినే దానిని కూడా ఒకే సమదృష్టితో చూస్తారు " అని అర్ధం. అన్ని జీవులని ( మనుషులే కాదు ) సమభావంతో చూసేవాడే నిజమైన ఉత్తముడు అని తెలియచేసారు.
" సర్వే అత్ర సుఖినః సంతు,
సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ "
అంటే " అందరూ సుఖంగా జీవించవలెను. అందరూ శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యవంతులుగా ఉండవలెను. అందరూ మంగళములను/శుభములను చూడవలెను. ఏ ఒక్కనికీ దుఃఖం లేకుండుగాక " అని అర్ధం.
" న త్వహం కామయే రాజ్యం,
న భోగాన్ న సుఖాని చ,
కామయే దుఃఖతప్తానాం,
జీవినాం ఆర్తి నాశనం ".
అంటే " నేను సామ్రాజ్య భోగాలను కోరను, ఏ లౌకిక భోగాలుకాని ఏ లౌకిక సుఖాలను కాని కోరను, ఇంక నేను మానసికంగా కోరేది ఏమిటంటే దుఃఖాలతో బాధపడుతూన్న ప్రాణులయొక్క దుఃఖాలను దూరంచేసి వారికి శాంతి ని చేకూర్చు తండ్రీ " అని భగవంతుణ్ణి కోరుకోవడం.
ఎంతటి అద్భుత సంస్కృతి.
మరి అలాంటి సంస్కృతి ప్రభవిల్లిన ఈ దేశం లో ఇప్పుడు ఇలా అయిపోతూందేమిటి. తరతరాలకు సరిపడేలా వేలకోట్ల ప్రజాధనం దోచుకోవడాలూ, తోటి మనుషులపై జుగుప్సాకరమైన తిట్లతో విరుచుకుపడడాలూ చూస్తూంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకపోదు . రూస్ ( రష్యా ) దేశ పండితుడైన " లూయీరేణు ", జర్మన్ దేశీయుడైన " మేక్స్ ముల్లర్ " పండితుడు ఏమన్నారు మన " సంస్కృతం/సంస్కృతి " గురించి అని రేపు తెలుసుకుందాం.
సర్వే జనాః సుఖినో భవంతు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment