భగవద్గీత 2:3 - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" క్లైబ్యం మా స్మ గమః పార్ధ
నైతత్త్వయ్యుపపద్యతే,
క్షుద్రం హృదయదౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ట పరంతప "
- భ.గీత 2:3
అర్జునుడు యుద్ధం చేసి రక్తపుకూడు తినలేనని నేలపై కూలబడిపోతే పరమాత్మ అంటారు " క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి లే " అని. ఇక్కడ ఆశ్చర్యకరంగా స్వామి " క్లైబ్యం " అనే పదాన్ని వాడేరు. క్లైబ్యం అంటే " నపుంసకత్వం ".
ఋగ్వేదంలో ఇలా ఉంది:
" నరుతే శ్రాంతస్య సఖ్యాయదేవాః"
అంటే " ఎవడైతే కష్టపడడో వానికి దేవుడు కూడా సహాయపడడు " అని.
" సమద్య ఆవిధతే వర్ధమానః....."
అంది వేదం. అంటే " జీవితం ఒక సమరం. ఏదీ ఊరికే రాదు. కష్టపడాలి. విఘ్నాలను ప్రతికూలతలను ఎదుర్కోవాలి " అని. పరమాత్మ కూడా గీతని అర్జునుడికి యుద్ధప్రాంగణంలోనే చెప్పారు.
ఆదిశంకరులు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా 3 సార్లు దేశమంతా కాలినడకన తిరిగి ఎందరినో వాదనలతో ఓడించి మెప్పించి సనాతనధర్మ పరిరక్షణ చేసారు.
వివేకానందుడు " ప్రపంచమతాలన్నిటికీ తల్లి అయిన సనాతనధర్మం తరపున, భారతదేశం తరఫున మీకు నమస్కరిస్తున్నాను " అన్నారు పరాయిదేశం చికాగోలో. అటువంటి ధైర్యాన్ని ఆయనకు ఇచ్చినది సనాతనధర్మమే.
అటువంటి అద్భుత వారసత్వసంపదని భూమిలో ప్రాతేసి పౌరులను దేశాభిమానం, భాషాభిమానం లేని వాళ్ళుగా, సోమరులుగా తయరుచేసారు కొందరు వారి స్వలాభం కోసం.
ఇప్పటికయినా ఆలస్యం కాలేదు. పౌరులు మేల్కుని దేశసౌభాగ్యానికి, సనాతనధర్మ పునరుజ్జీవానికి అంకితులవాలి. అవుతారని ఆశిద్దాం.
సర్వే జనాః సుఖినో భవంతు.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment