భగవద్గీత 3:20 - ఆసక్తిరహితకర్మ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" కర్మణైవ హి సంసిద్ధం
ఆస్థితా జనకాదయః
లోకసంగ్రహ మేవాపి
సంపస్యన్ కర్తృమర్హసి "
- భ.గీత 3:20
" జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్ధమై కర్మలను ఆచరించుటయే సముచితము " - అన్నారు పరమాత్మ.
ఇక్కడ రెండు ముఖ్యముగా గమనించవలసిన విషయాలు ఉన్నాయి. " లోకహితార్ధమై " అన్నారు పరమాత్మ, ఏ కర్మ అయినా సమాజశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అని. తరువాత " సముచితము " అన్నారు, అంటే మంచిది అన్నారు. ఇలా చెయ్యి అనలేదు, ఇలా చేస్తే మంచిది ( తరువాత నీ ఇష్టం ) అన్నారు పరమాత్మ. ఎంత అద్భుతం మన సనాతనధర్మం.
వ్యాసర్షి ఒకరోజు పక్షులజంట ముచ్చట్లు చూసి ఆశ్చర్యపోతారు. మగపక్షితెచ్చిన ఆహారాన్ని తల్లిపక్షి పిల్లల నోటికి అందిస్తూంది. పక్షుల సంసారమే ఇంత ముచ్చటగా ఉంటే మనుషుల సంసారం ఎంత అద్భుతం అని భావించి తనకుకూడా ఒక పుత్రుడు కలుగుతే బావుంటుంది అని భావిస్తారు. " శుక " జననం జరిగింది.
వ్యాసర్షి శుకుడిని వివాహం చేసుకుని సంతానాన్ని పొందమంటారు. " ససేమిరా " అంటారు శుకులు. అప్పుడు మరింత జ్ఞానసముపార్జనకోసం వెళ్ళి జనకమహారాజు ని కలవమంటారు వ్యాసర్షి శుకులను. శుకుడు తండ్రిమాటమీద గౌరవంతో వెడతారు. జనకుడు సభలో ఉండి రాచకార్యాలలో నిమగ్నమై ఉంటారు. శుకుడు ఇంతగా ఇతర " పనికిమాలిన పనులు " చేస్తూన్న ఈయన జ్ఞానం ఏమి చెబుతాడు అని తిరిగివెళ్ళిపోతూంటారు. అప్పుడు జనకుడు వచ్చి " తత్వం " బోధిస్తారు.
శుకులు " ముక్తి పొందడం " అంటే అన్నిసమయాల్లోనూ ముక్కుమూసుకుని ఏకాంతంగా కూర్చోవడంకాదు, సమాజానికి ఉపయోగపడే కర్మలు కూడా చేస్తూ సాధన చెయ్యాలని గ్రహిస్తారు.
పరీక్షిత్తుకి భాగవతం చెప్పడం వంటి సమాజశ్రేయస్సు పనులు ఎన్నో చేసి ఎందరో జీవులను తరించేలా చేసారు.
ఆశ్చర్యకరం ఏమిటంటే జనకుడికి కూడా చివరసమయంలో భాగవతం చెబుతారు శుకులు.
అందుకే పరమాత్మ " జనకుని " ప్రస్తావన తెచ్చి ఆ విధంగా చెయ్యడం సముచితం అని తెలియచేసారు.
" ప్రవృత్తిం చ నివృత్తిం చ.." - భ.గీత 18:30. వేదం " ప్రపంచంలో ఉంటూనూ, దూరంగా ఉంటూనూ " చేసే రెండు సాధనమార్గాలనూ ప్రతిపాదించింది. అదీ మన సనాతనధర్మ విశిష్టత.
ప్రక్క ఇంటిలో దుర్ఘటన జరిగి హడావిడిగా ఉంటే " నాకెందుకు, నేను రామజపం చేసుకుని తరిస్తాను" అని ఇంట్లో కూర్చోకూడదు. అలా చేస్తే పరమాత్మ అనుగ్రహించరు. ఓం తత్ సత్.
ఈరోజు పవిత్రమైన " ఉత్పన్న ఏకాదశి ". పరమాత్మని స్మరించుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment