లలితానామం - నైష్కర్మ్యా - 900 - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నైష్కర్మ్యా " - అమ్మవారి అద్భుతనామం . ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 900 వ నామం.
" నైష్కర్మ్యా " అంటే వేదోక్త కర్మలు కలిగియుండినను కర్మ సంబంధము లేకుండుట.
సృష్టి స్థితి లయలు, జీవులకు వారివారి కర్మలకు అనుగుణంగా ఫలాలు ఇవ్వడం లాంటి విద్యుక్తకర్మలు చేస్తూన్నా ఆ కర్మల సంబంధాలేమీ అమ్మవారికి ఉండవు. " పద్మపత్రమివాంభసా " అంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది అమ్మవారు.
ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో చెబుతారు అర్జునుడికి:
" న మే పార్ధాస్తి కర్తవ్యం
త్రిషు లోకేషు కించన,
నానవాప్తమవాప్తవ్యం
వర్త ఏవ చ కర్మణి "
- భ.గీత 3:22
" నేను కోరునదికాని పొందవలసినదికాని ఏదియును లేకున్నను విహితకర్మలయందు నేను నియుక్తుడనై యున్నాను " అన్నారు పరమాత్మ. " నేను కర్మలు చేయకుండా ఉన్నట్లయితే జీవులు కూడా కర్మలు చేయడం మానేస్తారు. అది లోకవినాశనానికి దారితీస్తుంది " అని కూడా తెలియచేసారు.
ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకతనికి లాటరీలో లక్ష వచ్చింది. సంతోషిస్తాడు. జూదంలో లక్ష పోతుంది. బాధపడతాడు. బ్యాంకులో కేషియర్ ఉంటాడు. ఒకాయన వచ్చి లక్ష కడతాడు. కేషియర్ కి సంతోషమేమీ కలగదు. ఇంకొకాయన వచ్చి లక్ష తీసుకుంటే బాధా ఉండదు. కేషియర్ నుంచి లక్ష తీసుకున్నాయన ఆ డబ్బుని అనాధశరణాలయానికి దానంగా ఇస్తే కేషియర్ కి పుణ్యం ఏమీరాదు. అలాగే ఆ లక్షని ఓ హత్య చెయ్యడానికి వాడినా కేషియర్ కి పాపమూ రాదు. కేషియర్ ది విద్యుక్తకర్మ. కర్మసంబంధమేమీ అతనికి ఉండదు. కట్టిన డబ్బు ఖాతాలలో జమచేస్తూ తీసుకునే డబ్బును ఖాతాలలో తగ్గిస్తూ ఉంటాడు. అతను చేస్తూన్నది కర్మలే అయినా అతనికి కర్మసంబంధాలేమీ అంటవు కదా.
అలాగ జీవుడు చేసే కర్మల ఫలాలను వారివారి ఖాతాలలో వేసి వాటికితగ్గ ఫలితాలను ఇస్తూ ఉంటారు అమ్మవారు. అమ్మవారికేమీ జీవుల కర్మఫలాలతో సంబంధం ఉండదు.
ఎల్లప్పుడూ మంచికర్మలే చేస్తూ ఉండేలా అనుగ్రహించమని అమ్మవారిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment