శ్రీలలితానామం 990 - అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభమా - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" అభ్యాసాతిశయజ్ఞాతా " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 990వ నామం.
" అమ్మవారిని అతిశయించిన అభ్యాసం/సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు " అని.
మూకశంకరులు తన " మూకపంచశతి " లో శ్రీకామాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు - " చిరతర సుచరిత సులభః " - అంటే అమ్మవారి అనుగ్రహం పొందడం చాలా సులువుట. కాని దానికి బహుకాలం మంచిగా/శ్రద్ధగా సేవించుకోవాలి అని.
ఇదే విషయాన్ని పరమాత్మ భ.గీతలో ఇలా చెప్పారు:
" అభ్యాసయోగయుక్తేన ,
చేతసా నాన్యగామినా,
పరమం పురుషం దివ్యం,
యాతి పార్ధానుచింతయన్"
- భ.గీత 8:8
నా మాయను తప్పించుకోవడం మహామహుల వల్లే కాదు అని చెబుతూ ఈ శ్లోకంలో " అభ్యాసం/సాధనతో నన్ను పొందడం కష్టం కాదు " అని తెలియచేసారు.
మరి " సాధన " అంత సులభమా.
" శ్రీరామ శ్రీరామ శ్రీరామ " అని కేవలం 3 సార్లు అనుకుంటే విష్ణుసహస్రనామపారాయణ ఫలం ఎలా వస్తుంది. అంత సులభమా స్వామి అనుగ్రహం పొందడం.
అమ్మవారు పార్వతీదేవి ఏమని అడిగారు శివుడిని:
" కేనోపాయేన లఘునా
విష్ణోః నామసహస్రకం,
పఠ్యతే పండితైర్నిత్యం
శ్రోతుమిచ్ఛామ్యహంప్రభూ "
ఇక్కడ " పండితైః " అన్నారు. అంటే పండితులు. వారు రోజూ విష్ణుసహస్రం చదువుతూ ఉంటారు. ఎప్పుడో ఒకరోజు ఏవో సమస్యలవలన చదవలేకపోతారు వారు. అలాంటప్పుడు సులువైన మార్గం ఏమయినా ఉందా అని అడిగారు అమ్మవారు. దానికి స్వామి అలాంటి ప్రత్యేక పరిస్థితులలో " శ్రీరామ " అని 3 సార్లు అనుకుంటే ఆ ఫలం దక్కుతుందన్నారు.
అంతే కాని " టి20 ఆట " ఉంది కదా అని శ్రీరామ అని 3 సార్లు గబగబా అనుకుని టివిముందు కూర్చుంటే విష్ణుసహస్రనామపారాయణ ఫలం వచ్చేయదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment