" గరిక మహిమ " - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" గరిక మహిమ "
గణపతిని గరికతో పూజిస్తారు. ఆయనకు అది ఎంతో ఇష్టం అంటారు. గరిక అంటే గరికకొసలు - చివరిభాగం - దూర్వాంకురాలు అంటారు.
ఆశ్చర్యంగా ఉంటుంది. మహాకాయుడు, కోటిసూర్యసమప్రభువుని గరికతో పూజించడం ఏమిటీ అని.
గణపతినవరాత్రులలో లక్షగరికపూజ చేస్తూంటారు, మా గ్రామంలో కూడా.
మనలాంటి సామాన్యులకే కాదు మహామహులకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది " ఈ గరికతో స్వామికి పూజ ఏమిటీ " అని.
శాండిల్యమహర్షి ప్రతిదినమూ గణపతిని గరికతో పూజించేవారు.
ఆయన భార్యపేరు ఆశ్రయ. ఆవిడికీ ఆశ్చర్యమే, రోజూ గరికతో పూజ ఏమిటీ అని. మహర్షిని అడుగుతే ఆయన వేదాలలోని విషయాలు చెప్పారు కాని ఆవిడకు సందేహం తీరలేదు.
అప్పుడు మహర్షి గణపతి శిరస్సుమీద నుంచి ఓ గరికను తీసి " మనకూ ధనం అవసరం కనుక దీనిని తీసుకుని వెళ్ళి దేవేంద్రుడికి ఇచ్చి సరిపడా ధనం ని ఇవ్వమని తీసుకురా " అన్నారు.
ఆవిడ" దీనికేమి వస్తుంది " అని మనసులో అనుకున్నా మహర్షి చెప్పారు కనుక ఇంద్రుడి దగ్గరకు వెళ్ళింది.
ఇంద్రుడు ఈవిడను చూడగానే గబగబా సింహాసనం దిగి " కాకిచేత కబురు పెడితే నేనే వద్దును కదమ్మా, మీరు ఇలా వచ్చారేమిటి " అని అడిగాడు. మహర్షులు, వారి పరివారం అంటే అంత గౌరవం దేవేంద్రుడికి కూడా.
మునిపత్ని విషయం చెబుతే ఇంద్రుడు " ఈ గరికకు ఏమి వస్తుందమ్మా, మీకు కావలసిన బంగారం, మణులు తీసుకుని వెళ్ళండి " అంటే మునిపత్ని " లేదు, మహర్షి చెప్పినట్లు చేయండి " అన్నారు. సరే దీని విలువ తెలియదు కనుక దీని బరువుకు తగ్గ ధనం తీసుకుని వెడుదురుగాని అని ఓ త్రాసు తెప్పించి ఓ వైపు గరికను ఉంచి రెండవవైపు ధనం వెయ్యడం మొదలుపెట్టారు.
ఇంద్రుడుదే కాదు కుబేరుడు వరుణుడు అగ్ని మొ.గువారి అందరి సంపదలు పట్టుకువచ్చి వేసినా గరికకు సరిపోలేదు. అప్పుడు ఇంద్రుడు " అమ్మా మీకు మాకే కాకుండా లోకాలన్నిటికీ గరికవిలువ తెలియచేయాలన్నదే మహర్షి అభిప్రాయం. మనందరం వెళ్ళి మహర్షిని క్షమాపణ కోరుకుందాం, పదండి " అన్నారు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఓ అణుశాస్త్రవేత్త తన పదవీవిరమణ తరువాత ఓ యంత్రాన్ని కనిపెట్టారు. అది ఏ వస్తువుదగ్గర పెట్టినా దాని నుంచి వెలువడే " ధన - ఋణ " శక్తితరంగాలను తెలియచేస్తుంది.
ఆయన గరికతో పాటు మనం దేవతా వృక్షాలుగా కొలిచే " తులసి మారేడు రావి మర్రి ఉసిరిక కదంబం " వృక్షాల వద్ద కూడా పరీక్షించి ఇవన్నీ ఎక్కువగా ధన శక్తితరంగాలను విడుదలచేస్తున్నాయని గ్రహించి ఆ విషయాలను ఓ విజ్ఞానసదస్సులో తెలియచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అద్భుతం ఏమిటంటే ఆయన కదంబవృక్షం ని కూడా పరీక్షించారు. అమ్మవారిని " కదంబవనవాసినీ, కదంబకుసుమప్రియా " అని ప్రార్ధిస్తాం. కదంబం అంటే అంత ఇష్టం అమ్మవారికి.
ఇటువంటి వృక్షాలవద్ద కూర్చుని ధ్యానం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది అని మన ఋషులు గ్రహించారు . ఇలా చేసి లబ్దిపొందండని మనకు తెలియచేసారు. అదీ మన ఋషుల అద్భుత విజ్ఞానం.
మన ఋషుల విజ్ఞానానికి, సనాతనధర్మానికి సాటి ఏదీ లేదు, రాదు.
ఏతత్ సర్వం శ్రీగణపతిదేవార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment