గీతాజయంతి శుభాకాంక్షలు అందరికీ- చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి.
" ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం "
"యతో ధర్మః తతో కృష్ణః, యతో కృష్ణః తతో జయః" - ధర్మంతోటే జయం ముడిపడి ఉంది.
" ధర్మక్షేత్రే " అనే చక్కటి పదంతో మొదలయ్యింది గీత. ధర్మాన్ని విడవద్దన్నారు. పరధర్మం ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నా స్వధర్మమే మేలన్నారు ( 3:35 ) పరమాత్మ.
" క్లైబ్యం మా స్మ గమః ( 2:3 )" - నపుంసకత్వం వదలమన్నారు, హృదయదౌర్బల్యం మంచిది కాదన్నారు, ధైర్యంగా కర్మలని చెయ్యమన్నారు.
ప్రకృతిపరంగానే 3 గుణాలు ( 3:5 ) - సత్వ రజో తమో - కలుగుతున్నాయి అని చెబుతూ రజో తమో గుణాలమీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచమన్నారు. తీసుకునే ఆహారంకూడా ఈ గుణాలను ప్రభావితం చేస్తుంది కనుక మితంగా సాత్వికాహారాన్ని తీసుకోమన్నారు ( 17:7 ).
ఈశరీరాన్ని " దుఃఖాలయం ( 8:15 ) " అన్నారు. శివాలయంలో శివుడు, రామాలయంలో రాముడు ఉన్నట్లు ఈ శరీరంలో ఎప్పుడూ దుఃఖం ఉంటుందని అర్ధం. " అశాంతస్య కుతః సుఖం ( 2:66 ) " అన్నారు.
ఇతర విషయాలన్నిటినీ ప్రక్కనపెట్టి నన్ను స్మరించు, అన్నీ నేను చూసుకుంటాను అన్నారు ( 9:22 ). మనసు కోతిలాంటిది, నీపైమాత్రం ఎలా నిలుస్తుంది అంటే ధ్యానం ( 6 వ అధ్యాయం ) చెయ్యమని చెబుతూ అది ఎలా చెయ్యాలో కూడా అరటిపండు వలిచి ఇచ్చినట్లు చెప్పారు.
" యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( 10:25 ) " - " నేను జపయజ్ఞాన్ని, జపంచెయ్యి చాలు, వేదాలు చదవకపోయినా, యజ్ఞయాగాలు చెయ్యకపోయినా పరవాలేదు అనుగ్రహిస్తాను " అన్నారు. " సమయజ్ఞః " - సమయజ్ఞం అంటే స్వ, పర అని తేడాలేకుండా అందరిలో ఉన్న జీవుడు ఒకరేగా చూడమన్నారు.
ధర్మబద్ధంగా జీవించాలనే ఉంటుంది అందరికీ కాని తెలియకుండానే చెడుపనులు చేస్తున్నారు కదా అంటే " గతజన్మల కర్మఫలం. కాని ఎంత పెద్ద దూదిమేటయినా ఒక్క నిప్పురవ్వతో మసి అయిపోయినట్లు నా నామజపం చేస్తే జన్మజన్మల పాపాలైనా హరించిపోతాయి " అన్నారు.
పత్రం పుష్పం ఫలం తోయం ( 9:26 ) - ఏది ఇచ్చినా సంతృప్తిచెంది అనుగ్రహిస్తానన్నారు. ఇవన్నీ ప్రకృతిలో సులభంగా దొరికేవే.
కర్మలు చెయ్యకుండా ఉండకూడదు, ఉండలేవు ( 3:5 ) అన్నారు. కర్మలను త్యజించడం కష్టం కనుక కర్మఫలాన్ని త్యజించు - " కర్మణ్యేవ అధికారస్తే మాఫలేషు కదాచన ( 2:47 )" - అన్నారు. ఏకర్మకి అయినా ఫలితం ఉంటుంది కాని ఆశించిన ఫలితం రానప్పుడు కూడా తేలిగ్గా తీసుకోగలిగితే " సత్ చిత్ ఆనందమే " కదా.
కామ క్రోధ లోభాలు నరకద్వారాలు ( 16:21 ), వదిలేయాలన్నారు.
ఆశ్చర్యకరమూ అద్భుతవిషయమేమిటంటే ఇన్ని విషయాలూ చెప్పి విశ్వరూపదర్శనంతో తనేమిటో తెలియచేసి చివరికి " ఇతితే జ్ఞానమాఖ్యాతం ( 18:63 ) - అంటే అతిరహస్యమయిన విషయాలన్నీ చెప్పేసాను, ఏదో నేను చెప్పానని కాకుండా నీబుద్ధితో నువ్వు ఆలోచనచేసి నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి " అన్నారు. ఎవరి కర్మలకు వారే బాధ్యులు.
పరమాత్మ సర్వజనులు సులువుగా తరించడానికి ఇచ్చిన అద్భుతకానుక గీత.
గీతాసారాన్ని గ్రహించి అందరూ తరిస్తారని ఆశిద్దాం.
శ్రీగీతాజయంతి శుభాకాంక్షలు అందరికీ.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Your blog on the eve of Geetha Jayanthi/vykuntha Ekadasi is very interesting. Namaste.
ReplyDeleteGreatness lies with Bhagavad Gita
ReplyDelete