దేముడు ఉన్నాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
దేవుడు ఉన్నాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటూ కొందరు మేధావులు తెగ ఆలోచన చేస్తూంటారు.
యజ్ఞం అంటే నమ్మకంతో చేసే కర్మ. సత్కర్మలు అసత్కర్మలు అని రెండురకాలు. సత్కర్మలు అంటే మంచిపనులు. కొట్టడం తిట్టడం మంచిపనులు కావు కదా. మరి అమ్మ పిల్లలను కొడుతుంది, తిడుతుంది. అంటే మంచికోసం చేసే పనులన్నీ సత్కర్మలే. అలాగే అసత్కర్మలు అంటే చెడ్డపనులు అని. అంటే అపనమ్మకంతో చేసేపనులు. అంతే కాని దొంగతనం, హత్యలు లాంటివి కావు.
మామేనత్తగారు దృష్టి ( దిష్టి ) మంత్రం వేసేవారు. వీభూతి మంత్రించి ఇచ్చేవారు. ఓ గ్రహణసమయంలో నేను మాగ్రామంలో ఉండడంతో ఆవిడ " రేపు గ్రహణసమయంలో స్నానం చేసి రా, మంత్రోపదేశం చేస్తాను " అన్నారు. వెళ్ళాను. మొదట ఆవిడ అన్నారు " మంత్రం వినగానే ' ఇదేమిటి, ఇదామంత్రం ' అనే ఆలోచన రానీయకు " అని. నమ్మకం ముఖ్యం, ఆరోజు మొదలుకుని గత 40 ఏళ్ళుగా రోజూ కనీసం 11 సార్లు దానిని మననం చేస్తాను.
ఇప్పుడో చిన్న విషయం చూద్దాం. ఒంట్లో బావుండక డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. మందులు వ్రాసి ఇచ్చారు. నమ్మకంతో కొనుక్కుని వేసుకుంటాం. అంతేకాని ఈ మందులతో ఎవరెవరికి తగ్గిందో పేర్లు ఇవ్వండి అని అడగం కదా. సరే మందుల కొట్టుకు వెళ్ళి మందులు కొంటాం. దానిమీద పారాసిటమాల్ 500 మి.గ్రాములు ఉంది అని ఉంటుంది. ఏదయినా లాబ్ కి వెళ్ళి సరిగ్గా 500 ఉందా అని పరీక్ష చేయిస్తామా.
కొన్ని కొన్నింటిమీద నమ్మకంతో ముందుకు పోవాలి. ఋషులు దర్శించి అనుభూతిపొంది దేవుడు ఉన్నాడు, ఇలా ఉంటాడు, ఇలా చేస్తే బాగుపడతావు, ఇలా చేస్తే బాధపడతావు అని స్పష్టంగా చెబుతే పాటించక నిజంగా దేముడు ఉన్నాడా అనే శంక ఎందుకు.
" అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 ) " - అన్నారు పరమాత్మ. ఎప్పుడూ అశాంతి/శంకతో ఉండేవానికి సుఖం ఎక్కడిది అని.
ఏపనికయినా నమ్మకం, శ్రద్ధ ముఖ్యం. సంకల్పం మంచిదయితే సత్ఫలితం తప్పకుండా ఉంటుంది. మంత్రం శ్రద్ధగా జపిస్తే చింతకాయలేమిటి ఏవి కావాలంటే అవి రాలుతాయి.
" తన్మే మనః శివసంకల్పమస్తు ( సంకల్ప సూక్తం ) - మా మనసుల్లో ఎప్పుడూ మంచి సంకల్పాలే కలిగించు దేవా " అని పరమాత్మని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరమాత్మార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment