గురుదత్తాత్రేయ జయంతి నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
గురుదత్తాత్రేయ జయంతి నేడు.
అత్రిమహర్షి అనసూయల పుత్రుడు ఈయన. అనసూయ మహాపతివ్రత. సీతారామలక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించేముందు ఈవిడ ఆశీస్సులు తీసుకుంటారు.
ఆయన పుట్టుకే ఓ అద్భుతం. త్రిమూర్తులు, వారి భార్యలు కూర్చుని మాట్లాడుకుంటూంటే నారదుడు వస్తారు. మాటల్లో " మహాపతివ్రత " ఎవరూ అనే విషయం వస్తే నారదులు " అనసూయమ్మే " అనడంతో ముగ్గురమ్మలు బాధపడి, అలిగి, త్రిమూర్తులని " అది తప్పు " అని నిరూపించి రమ్మంటారు.
త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి వస్తారు. ఆమె సంతోషంతో భోజనంచెయ్యమని అడిగితే వారు తను దిగంబరంగా వడ్డిస్తే తింటామంటారు. దానికేముంది అని త్రిమూర్తులను చిన్నపిల్లలుగా చేసేసి తినిపిస్తుంది.
త్రిమూర్తులు ఆమె సమయస్ఫూర్తికి ముగ్ధులయి వరం కోరుకోమంటే వారిని తనకు కుమారులుగా జన్మించమంటుంది. బ్రహ్మ అంశతో చంద్రుడు, శివుని అంశతో దూర్వాసుడు జన్మించారు. విష్ణువు మిగతా ఇద్దరి అంశలు కలుపుకుని దత్తాత్రేయుడిగా జన్మించారు.
ఆయన భార్య అనఘాదేవి. అఘం అంటే పాపం. అనఘ అంటే పాపం అంటనిది/లేనిది. పరమపవిత్రురాలు. శ్రీలలితాసహస్రంలో ఒక అద్భుతనామం (987 వ నామం).
త్రిమూర్తుల అంశవల్ల సద్గురువు అయారు. ఆయన ప్రసాదించలేనిది లేదు. ఐశ్వర్యంతో బాటు ఆనందాన్ని ప్రసాదిస్తారు. ఆనందం అంటే అజ్ఞానం తొలగడమే. ఆయన జ్ఞానప్రదాత.
యదు అనే మహారాజు ఈయన్ని " ఇంత ఆనందంగా ఉన్నారు. మీ గురువు ఎవరు " అని అడుగుతారు. ఈయన " నా ఆత్మే నా గురువు అయినా నాకు ఇంకా 24 గురువులు ఉన్నారు " అంటారు. ఆ 24 గురువులలో ఒకరు వేశ్య.
ఓ వేశ్య తెల్లవార్లూ గుమ్మం ముందరే కూర్చుని ఉంటుంది విటుడు కోసం. ఎవ్వరూ రాకపోవడంతో " తెల్లవార్లూ ఇక్కడ కూర్చుని జాగారం చేసాను, దేవుడి ముందు కూర్చున్నా పుణ్యమయినా వచ్చి ఉండేది " అని చింతిస్తుంది. అటువంటి ఆలోచనే అజ్ఞానం తొలగడానికి పునాది. కోరిక మనిషికి నిద్రలేకుండా చేస్తుంది. కోరికలు తగ్గించుకుంటే " సత్+ చిత్ + ఆనందమే ".
సృష్టిలో పనికిమాలినవారు అని ఎవరూ ఉండరు. ఏదో ఒక విషయంలో అందరూ నిష్ణాతులే అని తెలియచేసారు స్వామి. అమ్మవారి సృష్టిలో పనికిరానిది ఏముంటుంది కనుక.
" అపారకరుణా సింధుం
జ్ఞానదం శాంతరూపిణం,
శ్రీ దత్తాత్రేయ గురుం
ప్రణమామి ముదావహం "
గురుదత్తాత్రేయులని స్మరించుకుని, అజ్ఞానాన్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదించమని అందరం వేడుకుందాం.
" తత్ పురుషాయ విద్మహే,
అత్రి పుత్రాయ ధీమహి,
తన్నో దత్తః ప్రచోదయాత్ "
- దత్తగాయత్రి.
" గురుదత్తాత్రేయ జయంతి " శుభాకాంక్షలు అందరికీ - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete