భారత్ ప్రపంచానికి ఇచ్చినది " సున్న " - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీమాత్రేనమః " 🙏
" సంస్కృతి-సంస్కృతం 4 "
( 29/12/2023 న పోష్ట్ చేసిన " సంస్కృతి - సంస్కృతభాష 3" విషయాలకు ఇది కొనసాగింపు ).
జర్మనీ యూనివర్శిటీలో " మహామహోపాధ్యాయ " అని బిరుదు పొందిన " డా. ఆల్డ్ డోర్ఫ్ " అనే పండితుడు " జర్మన్యాం సంస్కృతాధ్యయనం " అనే అంశాన్ని గూర్చి అన్నమాటలు ఇలా ఉన్నాయి:
" జర్మన్యాం కశ్చిదేకః పండితః .....
.......... దీర్ఘాయుష్యం లిప్సతే.."
అంటే " జర్మనీలోని ఒకనగరంలోని పండితుడు కాళిదాసు అభిజ్ఞానశాకుంతలాన్ని శిరస్సుపై పెట్టుకుని పరవశంతో నాట్యం చేస్తూంటాడు. ఇంకోనగరంలో ఇంకో పండితుడు ఉపనిషత్తుల పారాయణంతో బ్రహ్మానందాన్ని పొందుతూంటాడు. ఇంకొకాయన ఇంకోనగరంలో మనుస్మృతి పఠనంతో మనశ్శాంతిని పొందుతూంటాడు. ఇంకొకకాయన పతంజలిమహర్షి యోగశాస్త్రాన్ని అభ్యసించి దీర్ఘాయుర్దాయాన్ని పొందగోరుతాడు " అంటూ విపులంగా వ్రాసారు.
ఇక జర్మన్ దేశీయుడే అయిన " మేక్స్ ముల్లర్ " పండితుడు తన "ఋగ్వేదభాష్య
పరిశోధన వ్యాసాంతం " లో తన పేరును, దేశాన్ని, తనుచదివిన యూనివర్శిటీ పేరును సంస్కృతంలోకి " తర్జుమా " చేసుకుని ఇలా వ్రాసుకున్నారు.
" శారణ్యదేశజాతేన,
గోతీర్థపురవాసినా,
మోక్షమూలార భట్టేన,
భాష్యమేతద్విశోధితం "
అంటే 1. శారణ్యదేశజాతేన అంటే జర్మనీదేశంలో పుట్టినవాడును.
2. గో, తీర్థ, పుర, వాసినా అంటే ఆక్స్, ఫర్డ్, యూనివర్శిటీ లో చదివినవాడునూ.
3. మోక్షమూలారభట్టేన అంటే మేక్స్ ముల్లర్ అనేపేరుగలవాడునూ అయిన వానిచే
4. ఏతద్భాష్యం విశోధితం అంటే ఈ భాష్యం శోధించి వ్రాయబడినది.
దీనివల్ల ఈ మహాపండితుడు ఋగ్వేదాన్ని బాగా పరిశోధించాడని తెలుస్తూంది, ఆ పదాల వాడుకను బట్టి. ఈయన " ప్రాచ్య ( తూర్పు ) లోకంలోని పవిత్రగ్రంధాలు " పేరిట 51 అపూర్వగ్రంధాలను రచించి మన " సనాతనధర్మం " గొప్పదనాన్ని ( వీరందరూ పరిశోధనలు చేయడానికి కారణాలు వేరైనా ) ప్రపంచదేశాలకి తెలియపరిచాడు.
బృహదారణ్యకోపనిషత్తులోని " పూర్ణమదః పూర్ణమిదం......ఏవావశిష్యతే " శ్లోకం ( పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా, పూర్ణంకి పూర్ణం కలిపినా పూర్ణమే మిగులుతుంది ) ద్వారానే ప్రపంచానికి " సున్న " అంకెను అపూర్వమైన బహుమానంగా ఇవ్వబడింది.
ఇంకా రేఖా , బీజగణితాలు, పైథాగరస్ ( శుల్బసూత్రం ) సిద్ధాంతం కూడా ప్రపంచానికి మొదట తెలియచేసినది మనదేశమే.
అవయముల స్వరూపమును, చేతిలో రేఖలను పరిశీలించి జీవితమును తెలిసికొను పద్ధతిని హిందువులే కనుగొని దానికి సాముద్రికము అని పేరు పెట్టారు. తరువాత దానిని చైనావారు, పారశీకులు, ఈజిప్టువారు, గ్రీకులు నేర్చుకొన్నారు. ఇది ఎలా తెలిసిందంటే " హిస్సాసన్ " అను గ్రీకువిద్వాంసుడు ఈ శాస్త్రగ్రంధమును సువర్ణాక్షరాలతో వ్రాయించి ఇది " ఉన్నతమనస్కులు, జిజ్ఞాసువులు ఆదరింపదగిన శాస్త్రము " అను సందేశంతో " అలెగ్జాండర్ చక్రవర్తి " కి పంపారు.
సంఖ్యాశాస్త్రమునకు కూడా గురుపీఠము భారతదేశమే " అని " కీరో " వ్రాసియున్నారు. ( ఈ కీరో, 1866 - 1936, ఐరిష్ జ్యోతిష్కుడు/సాముద్రికుడు. కొంకణ్ ప్రాంతానికి వచ్చి నేర్చుకుని ప్రఖ్యాతిగాంచాడు. నెట్ లో చదవండి ).
ఇంకా కణాలు ( అమ్మవారి " పరమాణుః " నామంగురించి ఇంకోసారి తెలుసుకుందాం ) గురించి తెలిపినది కణాదముని అని, ఇంకా కొన్ని సిద్ధాంతాలు (న్యూటన్ మొదలగు ) కి మూలాలు మన వేదాల్లోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తున్నాయి.
పాశ్చాత్యుల పేరు చెప్పుకోవడం ఎందుకంటే " పెరటిమొక్క వైద్యానికి పనికిరాదు " అని సామెత. మనవాడికి " మన " గొప్పదనం తెలియాలంటే " పాశ్చాత్యుడు " మెచ్చుకున్నాడంటేనే బాగా తెలుస్తుంది.
నలందా తక్షశిల విశ్వవిద్యాలయలలో పదివేల మంది దాకా విదేశీ విద్యార్థులు చదువుకునేవారు అని చరిత్ర చెబుతోంది. అటువంటి అద్భుత సనాతనధర్మానిని అడుక్కు తినే స్థాయికి దిగదార్చారు మూర్ఖులు.
మళ్ళీ మన " సనాతనధర్మం " పూర్వపు శోభను సంతరించుకుని ఓ వెలుగు వెలుగుతుందని ఆశిద్దాం.
సర్వే జనాః సుఖినో భవంతు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment