సుబ్రహ్మణ్యషష్ఠి - మధురస్మృతులు - చీమలపాటి సూర్యనారాయణ
చిన్నప్పుడు ఈరోజు సుబ్రహ్మణ్యషష్టి వస్తూందంటే 15 రోజుల ముందరనుంచీ సందడే. పెద్ద తీర్థం జరిగేది అందుకని.
తెల్లవారకట్ట 4 గం.లకే మాగ్రామానికి 1.5 కి.మీల దూరంలో ఉన్న కౌశికకి స్నానానికి నడిచి వెళ్ళేవారం. సైకిల్ స్టాండ్ కి.మీ దూరంలో ఉండేది, పైగా 10 పైసల టికట్. అందుకని నడిచే పోయేవారం. అక్కడ సుబ్రహ్మణ్యుడిగుడి, శివాలయం ఉన్నాయి. స్నానం చేసి వచ్చేసేవారం. దర్శనానికి మధ్యాహ్నం భోజనం అయాక వెళ్ళేవారం. ఎందుకంటే తీర్థం అప్పుడే మొదలయేది.
ఆరోజు బ్రహ్మచారికి భోజనం పెట్టుకుంటారు. ఓ అర్ధరూపాయి చేతిలో ( సంభావన ) పెట్టేవారు భోజనం అయాక. అది చాలా ఎక్కువ మొత్తం ఆ రోజుల్లో. అది పుచ్చుకుని తీర్థానికి పోయేవారం.
తీర్థంలో రంగులరాట్నం, చక్రం ఆట, పీచుమిఠాయి, జీళ్ళు అన్నీ ఉండేవి. 2 గం.కు వెడితే మళ్ళీ రాత్రి 7 గం.లకే రావడం ( వచ్చి తిట్లు తినడం ).
ఎంత హాయిగా ఆనందంగా ఉండేవో ఆ రోజులు. మధురస్మృతులు.
స్వామిని అందరికీ ఆనందాన్ని ప్రసాదించమని కోరుకుందాం - సూర్య.
అందరికీ శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి శుభాకాంక్షలు.
శుభం భూయాత్
Comments
Post a Comment