మహాభారతం - Interstellar Movie - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

" యదిహాస్తి తదన్యత్ర 

  యన్నేహాస్తి నతత్ క్వచిత్ ".

మహాభారతంలో ఉన్న అద్భుత శ్లోకం ఇది.

దీని అర్ధం " భారతంలో ఉన్నదే ఎక్కడా ఉంటుంది, భారతంలో లేనిది ఎక్కడా ఉండదు " అని. అదీ మన ఋషుల విజ్ఞానం, నమ్మకం. అంతటి అద్భుతమైన గ్రంధం భారతం. 

భారతం అంటే జూదం, వస్త్రాపహరణం, యుద్ధం అనే ఎక్కువ మంది భావన. అది ఒక మహాసముద్రం, దానిలో దొరకని విజ్ఞానం లేదు.

ఏ కొత్తవిషయం విన్నా చదివినా, చివరికి ఏది కొత్తగా కనిపెట్టినట్లుగా చెబుతున్నా దాని మూలాలు మన ప్రాచీనగ్రంథాలలో కనిపిస్తుంది. 

2014 లో " ఇంటర్ స్టెల్లర్ " అనే సినీమా వచ్చింది. క్లుప్తంగా కధ ఏమిటంటే భూమిమీద వనరులు సరిపోక విశ్వంలో కొత్త గ్రహాల వెదుకులాటలో శనిగ్రహం ప్రక్కన వాం హోల్ లాంటి రంధ్రం ఉంటే దానిలోకి వెళ్ళి అతికొద్ది రోజులు మాత్రమే ఉండి బయటకు వచ్చేస్తారు. హీరో బయలుదేరేటప్పుడు అతని కూతురు చిన్నపిల్ల. కాని కొద్దిరోజుల్లోనే తిరిగివచ్చిన హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతని కూతురికి 94 సం.ల వయస్సు. హీరో మాత్రం అదే 40 సం.ల వయస్సులో ఉంటాడు. కొద్ది రోజుల్లో అలా ఎలా సాధ్యం అని ఆశ్చర్యం. అసలు కారణం ఏమిటంటే హీరో వెళ్ళివచ్చిన లోకం/ప్రాంతంలో ఒకరోజు భూమిమీద కొన్ని సంవత్సరాల లెక్క అన్నమాట. ప్రేక్షకులు సినీమాకు బ్రహ్మరధం పట్టారు. ఖర్చు సుమారు 700 కోట్లు అవుతే ఆదాయం 3000 కోట్లు వచ్చింది. 

మనచేత పురాణాలూ ఇతిహాసాలూ చదివించి ఉంటే మనకు ఆ సినీమా నచ్చదు, చూడం. ఎందుకంటే అది మనకు వేల సంవత్సరాలక్రితమే తెలిసిన విషయం కనుక. 

కకుద్మి అనే చక్రవర్తి కుశస్థలి అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. ఆయనకు రేవతి అనే కూతురు. అమ్మాయి అద్భుత సౌందర్యవతి, ప్రతిభాశాలి. ఎందరో యువకులను చూసినా రేవతికి సరైన వరుడు దొరకకపోవడంతో కకుద్మి కూతురుతో సహా బ్రహ్మలోకానికి వెడతాడు, బ్రహ్మని సరైన వరుడు ఏలోకంలో ఉన్నాడో అడుగుదామని. ఈయన వెళ్ళేసమయానికి బ్రహ్మగారిముందు గంధర్వులు గానం, నాట్యం చేస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రక్కన నుంచున్నారు రాజు, కూతురు. నాట్యం అవగానే బ్రహ్మను కలిసి విషయం చెబితే ఆయన " ఎందుకు ఇక్కడికి వచ్చాక ఆలస్యం చేసావు. నువ్వు ఇక్కడ తక్కువ సమయమే ఉన్నా భూలోకంలో వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ నీ రాజ్యమూ లేదు, నీ మనుషులూ లేరు " అనడంతో రాజు ఆశ్చర్యపోయి మరిప్పుడేమి చెయ్యాలి అనడంతో బ్రహ్మ " ఇప్పుడు కృష్ణావతారం అవుతూంది. బలరాముడికి రేవతినిచ్చి వివాహం చెయ్యి " అనడంతో ఇంకా ఆలస్యంచేస్తే అవతారపరిసమాప్తి కూడా అవుతుందేమో అని వెంటనే భూలోకానికి తిరిగి వచ్చేసారు. 

ఆశ్చర్యం ఏమిటంటే రాజు యొక్క కుశస్థలే ద్వారక అయింది. మనుషులు రాజు కాలంతో పోలిస్తే మరుగుజ్జులు. వివాహానికి సరే అన్నా రేవతి బలరాముడు కన్నా పొడుగ్గా ఉండడంతో బలరాముడు తన నాగలితో ఆవిడ తలమీద కొట్టడంతో ఆవిడ కొంచెం పొట్టిదయింది అని ఉపకధ.

" అవతార్ " సినీమా చూసే ఉంటారు చాలామంది. దానిలో నాయకుడి వంటిరంగు, పెద్ద ( గరుడ ) పక్షులమీద తిరుగుతూ యుద్ధాలు చెయ్యడం చూస్తే అర్ధమవుతుంది దానికి ప్రేరణ ఏమిటో. 

" వేదో2ఖిలమూలం " - అన్నిటి మూలాలూ ఇక్కడే కనబడుతాయి.

ఇలా అనుకోవడం కాకుండా అద్భుత విజ్ఞాన విషయాలకోసం విదేశీయులు మన పురాణాలను, ఇతిహాసాలను శ్రద్ధగా చదువుతున్నారు అనుకోవచ్చు.

అదీ మన వాజ్మయం, ఋషులవిజ్ఞానం, సనాతనధర్మం గొప్పదనం. మన విజ్ఞానానికి సాటిలేదు, భవిష్యత్తులో రాదు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ