రైలు ప్రయాణం - ధర్మం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సంస్కృతి - సంస్కృతి 9 "

" ధారణాత్ ధర్మమిత్యాహుః " - ధారణ వలననే ధర్మం నిలుస్తుంది. ఏదయితే పట్టి ఉంచుతుందో దానినే ధర్మం అన్నారు.

రైలు ప్రయాణం ఎంతో సుఖంగా ఉంటుంది. ఎప్పటిదాకా, రైలు పట్టాలు మీద వెడుతూన్నంతవరకూ. పట్టాలే రైలును నడిపిస్తున్నాయి. కొద్దిగా ఇటూ అటూ అయినా ప్రమాదమే. పట్టి ఉంచే పట్టాలే ధర్మం. ధర్మం నుంచి ఏమాత్రం ప్రక్కకు తొలగినా జీవితం దుఃఖమయమే అని సనాతనధర్మం చెబుతూంది.

ధర్మం అంటే ఏమిటి, ఎలా ఆచరించాలి మరి?. శివాలయంకి వెడతారు దేవుడికి దండం పెట్టుకోవడానికి. శాస్త్రం ఏమి చెబుతూందంటే ముందు నందికి దండం పెట్టుకోమని. వృషభం/నంది అంటే ధర్మం అని అర్ధం. నంది ధర్మస్వరూపుడు. అందుకే ముందు ధర్మాన్ని గౌరవించు, నమస్కరించు, అనుమతిని తీసుకుని దైవదర్శనం చేసుకో అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. శివాలయంకి వెళ్ళినప్పుడు నంది కొమ్ములపై వ్రేళ్ళు ఉంచి మధ్యలోంచి చూడమంటారు. అంటే దేవుడినయినా " ధర్మం " లోంచి చూడమని. 

ధర్మం ఆచరించేదెలా. ఉపనిషత్తులు తెలియచేస్తూన్నది ధర్మం/వృషభం యొక్క నాలుగు పాదములు/కాళ్ళు వరుసగా " సత్యం, అహింస, అస్తేయం, శౌచం " అని, వీటిని శ్రద్ధగా ఆచరించాలనీనూ.

సత్యపాలనకు మొదటిస్థానం ఇచ్చారు. అది అత్యుత్తమమయిన ధర్మం.

అహింస గురించి చెబుతూ మనస్సులో ఎదుటివారికి హాని కలగాలని కోరుకోవడం కూడా హింసయే అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. ఎంతటి అద్భుతం మన సంస్కృతి.

మూడవది " అస్తేయం " - అంటే దొంగతనం లేకపోవడం. అదేమిటండీ ఎవరినీ, ఏ ఇంటినీ దోచుకోవట్లేదుగా అనుకోవచ్చు. ఇక్కడ దొంగతనం అంటే అక్రమార్జన, కష్టపడకుండా వచ్చే డబ్బు. దీని గురించి ఎక్కువగా తెలుసుకోవలసినది ఏముంది?.

నాలుగవది శౌచం. అంటే శుచి, శుభ్రత. ప్రపంచమంతా శుభ్రతని పాటిస్తుంది. కాని ఒక్క సనాతనధర్మమే శుచిని గురించి తెలియచేసింది. ఎక్కడయినా కూర్చుంటే తుడుచుకుని కూర్చుంటాం, చేతులు కడుక్కుంటాం - ఇవన్నీ శుభ్రత క్రిందకు వస్తాయి. శుచి అంటే సంస్కారం. ఎవరిని వారు సంస్కరించుకోవడం. స్నానంచేస్తే శుభ్రతవస్తుంది. స్నానం చేసాక చిన్న బొట్టుపెట్టుకుని మడి/ఉతికిన బట్టకట్టుకుని దేవుడిముందు ఓ అగరవత్తి వెలిగించి " తన్మే మనః శివసంకల్పమస్తు ( సంకల్పసూక్తం ) - నా మనస్సులో ఎప్పుడూ మంచి ఆలోచనలనే కలిగించు తండ్రీ " అని ఓ నమస్కారం పెట్టుకుంటే మనస్సు నిర్మలమవుతుంది, ఆ రోజంతా ఆనందదాయకంగా గడిచిపోతుంది.

ఇవన్నీ పాటించడం, మనస్సును నిగ్రహించుకోవడం అంత సులభం కాకపోయునా చేయగా చేయగా అలవాటయి పోతుంది. అలవాటయాక మాత్రం సదా " సత్ చిత్ ఆనందమే ".

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ