సీతమ్మతల్లిని పరమసాధ్వి అంటారెందుకు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
సీతమ్మవారు పరాయిదేశంలో రాక్షసుల మధ్య బందీగా ఉన్నా ఎక్కడా మాటజారలేదు. ఎంతో ధైర్యంగా ఉండడమే కాకుండా హనుమకు, విభీషణుడి కూతురు త్రిజటకూ అద్భుతమైన జీవితసత్యాలను తెలియచేస్తుంది.
హనుమతో అంటారు " జీవితంలో సుఖాలలాగే కష్టాలుకూడా శాశ్వతం కావు. మరణించేలోగా ఒక్కరోజయినా/క్షణమయినా మంచి/ఆనందం కలిగించేది వస్తుంది. ఆ రోజు/క్షణము ను ఆనందించడానికి తాను బ్రతికి ఉండాలిగా మరి " అని. అంటే కష్టాలకి కృంగిపోయి, ఆత్మహత్యలు అవీ చేసుకోకూడదు అని. యువతకు ఎంతటి అద్భుత సందేశం.
త్రిజటతో అంటారు " సుఖాలు సెలయేర్లలాగా, కొండల్లాగా చిన్నవిగా అనిపిస్తాయి. కష్టాలు సముద్రాలలాగ, పర్వతాలలాగా పెద్దవిగా అనిపిస్తాయి " అని. సుఖాన్ని ఓ సారి ఆనందించి వదిలేస్తాం. అదే కష్టమయితే తలుచుకుని తలుచుకుని బాధపడుతూనే ఉంటాం. ఎంతటి అద్భుత జీవితసత్యం.
" ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి, ననుబ్రోవమని చెప్పవే ...." అని వేడుకుంటే చాలు, ఆదుకోవడానికి శ్రీరాముడిని పంపిస్తుంది. అవ్యాజకరుణామూర్తి.
విశ్వనాధ సత్యనారాయణగారు తనువ్రాసిన రామాయణ కల్పవృక్షంలో అంటారు " నీ చరణ రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకున్ " అని. ఓ సీతమ్మా, నీ కాలిధూళి స్తీజాతి అంతా నుదిటిన బొట్టుగా పెట్టుకోవాలి అని. సీతమ్మ మాటలు అంత అద్భుతం రామాయణంలో.
వివేకానందులు అంటారు " ప్రపంచవాజ్మయం అంతా నాశనమయిపోయినా ఒక్క రామాయణం ఉన్నా లేక ఒక్క సీతమ్మను జ్ఞప్తిలో ఉంచుకున్నా భారతజాతి ( సనాతనధర్మం ) మరి కొన్నివేల సంవత్సరాలవరకూ నిలిచి ఉంటుంది " అని. ఎందుకని అంటే " శ్రీరాముడు లాంటి అందగాడు, ధీరోదాత్తుడు, ధర్మపరుడు ఇంకొకరు కనబడవచ్చు శ్రద్ధగా వెదికితే కాని సీతమ్మలాంటి స్త్రీ మాత్రం దొరకదు కాక దొరకదు " అని ఆయన నొక్కి వక్కాణించారు.
ఈరోజు యువతకు స్ఫూర్తిదాయకుడు, కారణజన్ముడు అయిన వివేకానందుడి జయంతి. శుభాకాంక్షలు.
అదిశంకరుల వలే తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా వివేకానందుడు సనాతనధర్మ పరిరక్షణకోసం శ్రమించారు. అమ్మవారి ఏర్పాట్లు అలాగే ఉంటాయి.
ఏతత్ సర్వం శ్రీసీతాదేవ్యార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Thanks for your write ups on epics and Bhagavadgita. They are informative and refreshing. Please keep continuing.
ReplyDeleteK.S.Sastry
Goddess bless you all
ReplyDelete