రాముడు తండ్రితో యుద్ధం చేయనంటే తండ్రి మాటను లెక్కచేయనట్లా? - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
" అందాల రాముడు
ఎందువలన దేముడు "
రామాయణం ఇతిహాసం అంటే " ఇతి + హా + సం " - ఇది ఇలాగే జరిగింది అని అర్ధం. రామాయణంలోని వారందరూ వ్యక్తులు. అంతేకాని పాత్రలు కావు.
సీతమ్మవారిని రావణుడు ఎత్తుకుపోవడం రామరావణ యుద్ధం మాత్రమే తెలుసు చాలామందికి. కాని ఎన్నో అద్భుతమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి ఆ మహాకావ్యంలో.
రాముడు తండ్రిమాట జవదాటడు అని చదువుకున్నాం మనం. కాని అది కొంతవరకే నిజం. రాముడు తండ్రి మాటలోని ధర్మాన్నే పాటించాడు అన్నది నిజం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతూంటే తండ్రి దశరధుడు అంటాడు " నీకు కావలిసిన సైన్యాన్ని తీసుకుని నాతో యుద్ధంచేసి గెలిచి రాజ్యం తీసుకో. రాజ్యం వీరభోజ్యం. నన్ను ఓడించడం అధర్మం కాదు " అని. మరి శ్రీరాముడు అలా చేసాడా తండ్రి చెప్పాడని. అది ధర్మం కాదు అనుకోవడం వలననే అరణ్యానికి వెళ్ళిపోయాడు.
ఆయన అరణ్యానికి వెడుతూంటే తల్లి కౌసల్య ఆశీర్వదిస్తుంది:
" యం పాలయసి ధర్మం
త్వధృత్వాచనియేనచ,
సవై రాఘవశార్దూల
ధర్మస్త్వామభిరక్షతు " అని.
అంటే " రాముడు ఏధర్మాన్ని అనుసరిస్తాడో ఆ ధర్మమే అతన్ని రక్షిస్తుంది " అని.
గురువుమాట వేదవాక్కు. వశిష్టుడు వారి కులగురువు. తిరిగివచ్చి రాజ్యాన్ని స్వీకరించమని ఎవరు చెప్పినా రాముడు వినకపోవడంతో వశిష్టుడుని నచ్చచెప్పమంటారు. " తండ్రి మరణించాక పెద్దకుమారుడు రాజ్యాన్ని స్వీకరించి పాలనచెయ్యడం శాస్త్రసమ్మతమే కాని అధర్మం కాదు, వచ్చి రాజ్యాన్ని స్వీకరించు " అని వశిష్టుడు చెప్పినా రాముడు ఒప్పుకోలేదు. అది ఋజువర్తనం కాదు, అలా నాలాంటివారు చేస్తే ప్రకృతి ( సూర్యుడు, భూమి, గాలి, నీరు వంటివి ) సహకరించదు, కరువుకాటకాలతో ప్రజలు నానాబాధలు పడతారు అంటాడు. అంటే కులగురువు చెప్పినా కూడా రాముడు అత్యుత్తమమైన ధర్మానికే కట్టుబడ్డాడు. శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మం.
ఆశ్చర్యకరము అద్భుతము అయిన విషయేమిటంటే
ఒక రాక్షసుడు, మారీచుడు, అన్నాడు " రామో విగ్రహవాన్ ధర్మః " అని. అంటే " ధర్మానికి ఓ రూపం ఇస్తే అది రాముడు లా ఉంటుంది " అని. ఎంత అద్భుత విషయం.
అంతటి ధర్మపరుడు కనుకనే శ్రీరాముడు ఆదర్శపురుషుడు అయాడు, వేల సంవత్సరాలుగా పూజింపబడుతున్నాడు. దేశప్రజలంతా వేల సం.లు అయిపోయినా నేటికీ " మా రామయ్యతండ్రి " అని తలుచుకుని మురిసిపోతున్నారు.
" అందాల రాముడు
అందువలన దేముడు "
నేడు " భోగి పండుగ " - శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
రాజ్యాన్ని తిరిగి తీసుకోవడం గురించి దశరథ మహారాజు మరియు శ్రీరాముడు మధ్య జరిగిన సంభాషణ గురించి వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను దయచేసి ఇవ్వండి
ReplyDeleteశుభమస్తు. మీ పేరు ఫోన్ నంబరు పెట్టండి
ReplyDelete