" అంతా రామమయం - జగమంతా రామమయం " - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
జనవరి 22న రామప్రతిష్ట "'రాముడు పుట్టిన ప్రదేశం " లో సుమారు 500 సం.ల తరువాత జరుగుతూంది అని అందరికీ తెలిసినదే. ఇది సాధ్యమవడానికి ఎందరో మహానుభావుల తపన, నిరంతరకృషి, రాముడిపట్ల అచంచల భక్తి ఉన్నాయి. వీరిలో ఒక రామభక్తుడి గురించి చదివి తరిద్దాం.
ఒకరోజు సుప్రీంకోర్టులో రామజన్మభూమిమీద వాదనలకు ఇరుపక్షాల న్యాయవాదులు, సాక్షులు తయారుగా ఉన్నారు. అప్పుడు న్యాయవాది శ్రీపరాశరన్ గారిని జడ్జిగారు " మీరు వేదాలలోంచి, ఉపనిషత్తులలోంచి విషయాలు బాగానే చెబుతున్నారు. అయోధ్యలోని ఆ ప్రదేశమే రాముడు పుట్టిన స్థలమని వేదంలో ఉన్నదా " అని అడిగారు.
అప్పుడు సాక్షులలోంచి ఒక అంధుడు లేచి " అయ్యా ఋగ్వేదంలోని ' జైమినీయ సంహిత ' లోని ఈ శ్లోకాలు సరయూనది ఒడ్డున ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశం నుంచి ఒక ప్రత్యేక దిక్కుగా ఫలానా దూరం ప్రయాణం చేస్తే రాముడు జన్మించిన ప్రదేశం చేరుకోగలము అని ఉంది " అని తెలియచేస్తూ ఆ శ్లోకాలు చదవడం జరిగింది. వెంటనే జడ్జిగారు ఆ విషయం పరిశీలించమనడం, అది నిజమే అని అధికారులు తెలియచేయడంతో జడ్జిగారు " ఈరోజు మేము ఒక అద్భుతం ( మిరకుల్ ) చూసాం " అని ఆశ్చర్యపడడం జరిగింది.
రామజన్మభూమి తీర్పు అంత సులభంగా రాలేదు. ఎందరో మహానుభావుల శ్రమ, కృషి ఫలితం.
ఆ విషయంని చెప్పిన ఆ అంధుడు " రామభద్రాచార్య ". అసలు పేరు గిరిధర్. పండిట్ రాజదేవ్ మిశ్ర, శచీదేవి మిశ్ర దంపతులకు " మకర సంక్రాంతి " నాడు జన్మించారు. జన్మదినమే ఒక అద్భుతమైన రోజు.
2వ నెలల వయస్సులో కళ్ళకు వ్యాధి సోకడంతో కంటిచూపు పోయి శాశ్వత అంధులయారు. అయినా పట్టువిడవక 5 ఏటకే భగవద్గీతలోని 700 శ్లోకాలను నేర్చుకుని 5వ ఏట ఓ కార్యక్రమంలో గానం చేసారు. 7 వ ఏటకే రామచరితమానస్ లోని 10900 పద్యాలను నేర్చుకుని 7వ ఏట ఓ కార్యక్రమంలో ఉపవాసదీక్షతో గానం చేసారు. వేదాలు ఉపనిషత్తులు పురాణాలను కంఠతా పట్టారు. చిత్రకూటంలో " తులసీదాస్ ట్రష్టు " ఏర్పాటుచేసి అంధులకు ఉన్నతవిద్యవరకూ పూర్తి విద్యను అందిస్తున్నారు. ఎన్నో గ్రంధాలను అందించారు. ప్రభుత్వం వీరిని 2015లో పద్మవిభూషణ్ తో గౌరవించింది.
ఈయన " ధర్మచక్రవర్తి, మహామహోపాధ్యాయ, శ్రీచిత్రకూటతులసీపీఠాధీశ్వర, జగద్గురు రామానందాచార్య, మహాకవి " అనే బిరుదులతో గౌరవింప పడుతున్నారు.
ఇటువంటి వారిని ఒకసారి తలచుకున్నా జన్మ చరితార్ధమవుతుంది. సందేహం అక్కరలేదు.
అమ్మవారు అవసరమయినప్పుడల్లా " ధర్మ పరిరక్షణకోసం " ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటారు. ఈ అద్భుత " రామ " కార్యానికి ఈయన్ని పంపించారు.
కారణజన్ములు. పుణ్యపురుషులు.
" అంతా రామమయం
జగమంతా రామమయం "
ఏతత్ సర్వం శ్రీశ్రీరామర్పణమస్తు - సూర్య.
శుభం భూయత్
Comments
Post a Comment