సీతమ్మతల్లి వనవాసానికి నారచీర కట్టుకుని వెళ్ళారా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అతిప్రవృత్తే దుర్మేధే 

  కైకేయీ కులపాంసని,

  వంచయిత్వా చ రాజానం 

  న ప్రమాణే2వతిష్టసే "

రాముడు వనవాసానికి వెడుతూంటే బ్రహ్మర్షి, స్థితప్రజ్ఞుడు అయిన వశిష్టుని నోటివెంట వచ్చిన మాటలివి - " మితిమించి ప్రవర్తిస్తున్న దుర్బుద్ధిగల కైకేయీ రాజుని వంచించావు, ఉత్తమవంశమున చెడబుట్టావు నువ్వు " అని.

బ్రహ్మర్షి వశిష్టులకు అంత కోపం ఎందుకువచ్చిందో చూద్దాం.

సభలో రాముడు తండ్రితో " వనవాసానికి బయలుదేరుతున్నాను. సీత, లక్ష్మణుడు నాతో వస్తామని పట్టుబడుతున్నారు, మీరు అనుమతిస్తే వారు కూడా నాతో వస్తారు. అనుమతిస్తే నారబట్టలు కట్టుకుని వెంటనే బయలుదేరుతాము " అని అంటాడు.

కైకేయి వెంటనే ముగ్గురికీ నారబట్టలు తెచ్చి రాముడుకి ఇస్తుంది. రామలక్ష్మణులు వెంటనే కట్టుకుంటారు. సీతకు అంత బరువున్న చీరను ఎలాకట్టుకోవాలో తెలియక కొంగు భుజమ్మీద వేసుకుని చూస్తూ ఉంటుంది. రాముడు సీత దగ్గరకు వెళ్ళి " ఇలా కట్టుకోవాలి " అని చెబుతూ ఉంటాడు.

ఆ దృశ్యం చూసి సభలోని వారందరూ తట్టుకోలేక భోరున ఏడుస్తారు. అప్పుడు వశిష్టులవారు కూడా నిగ్రహించుకోలేక కైకేయిని దూషిస్తారు పైవిధంగా.

తరువాత అంటారు " సీతమ్మ వనవాసానికి వెళ్ళనక్కరలేదు. రాముడు అధిష్టించవలసిన సింహాసనాన్ని తాను అధిష్టిస్తుంది. రాముడు పాలించవలసిన రాజ్యాన్ని తను పాలిస్తుంది. ఒకవేళ తను వనవాసానికి వెడతాను అంటే నారబట్టలు కట్టుకోవలసిన అవసరంలేదు. పట్టుచీరలే కడుతుంది వనవాసంలో కూడా. బంగారు ఆభరణాలు ధరించే ఉంటుంది ఎల్లవేళలా " అని.

అందుకని సందేహం అక్కరలేదు. సీతమ్మ పట్టుచీర కట్టుకొని, రోజూ ధరించే ఆభరణాలను వేసుకుని వనవాసానికి వెళ్ళింది. పట్టువస్త్రాలు ఎక్కువ కాలం మన్నకపోవచ్చనే అనసూయమ్మ " మాయనివస్త్రాలు " ఇచ్చింది సీతమ్మకు. రావణుడు ఎత్తుకు పోతూన్నప్పుడు ఈ చీరలోనిదే కొంతభాగాన్ని చించి దానిలో ఆభరణాలను కట్టి వానరుల మధ్య పడేలా విసిరింది. 

ఏ వస్త్రమయినా చిరుగు పట్టడం మొదలుపెడితే బిగువు పోయి చిరుగులు ఎక్కువ అవడం జరుగుతుంది. సీతమ్మ చీరను చింపిన తరువాత చిరుగులు ఎక్కువ అవడం, ఆ చిరుగులచీరను చూసి అశోకవనంలో హనుమ బాధపడడం జరిగిందని తెలుస్తూంది.

ఏచీర కట్టుకుని వనవాసానికి వెళ్ళారు, ఏ నగలు ధరించారు సీతమ్మతల్లి అన్నది విషయమేకాదు. కేవలం ఇటువంటివి సందేహమేదయినా కలుగుతే నివృత్తి కోసమే. ఆతల్లి ఏ ధర్మమార్గంలో నడిచింది, ఎటువంటి అద్భుతమయిన జీవితసత్యాలు, భారతీయులకు ముఖ్యంగా యువతకు ఏ అద్భుత సందేశాలను ఇచ్చారన్నదే ముఖ్యం. అదీ రామాయణపారాయణ ముఖ్యోద్దేశం కావాలి.

" నను బ్రోవమని చెప్పవే   

  సీతమ్మ తల్లి, 

  నను బ్రోవమని చెప్పవే....."

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. Chimalapati suryanarayana garu! please give the reference slokas in v almiki ramayanam that Vasistha maharshi said agreely to kaikeyi, as i could not see

    ReplyDelete
  2. Pl give ur name n mobile number. Will send to u. Goddess bless you

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ