రాముడిని అడవికి పంపించిన కైకేయి దోషి కాదా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" రామప్రవ్రాజనం హ్యేతత్ 

  సుఖోదర్కం భవిష్యతి,

  దేవానాం, దానవానాం చ 

  ఋషీణాం భావితాత్మనాం " 

భరద్వాజమహర్షి భరతుడుతో అంటారు " రాముడు బయలుదేరినది సుఖాలు ఇవ్వడంకోసం. దేవతలకు రాక్షసులకు ఋషులకు ధర్మాన్ని అనుసరించేవారికి సుఖం కలిగించడానికి బయలుదేరాడు " అని.

రాముడుని ఎలాగయినా ఒప్పించి అయోధ్యకు తీసుకురావాలని భరతుడు అందరినీ వెంటపెట్టుకుని బయలుదేరుతాడు. రాముడు వెళ్ళిన మార్గంలోనే ప్రయాణిస్తూ భరద్వాజమహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆయన ఆతిధ్యం ఇస్తానంటే ఆగి మహర్షికి తనవారిని పరిచయం చేస్తాడు భరతుడు. కైకేయిని పరిచయం చేస్తూ " సకలగుణసంపన్నుడయిన రాముడి వనవాసానికి, అయోధ్య అనాధ అవడానికి ఈవిడే కారణం " అంటాడు.

అప్పుడు మహర్షి " కైకేయిని తప్పుపట్టకు, ఆమె నిర్దోషి " అని చెప్పి రాముడు వనవాసానికి కారణం ఇది అని పై శ్లోకంలో చెబుతారు. 

ఇదే విషయాన్ని శ్రీరాముడు లక్ష్మణుడుతో అంటారు " కైకేయమ్మను ఎప్పుడూ తప్పు పట్టకు, ఆవిడ చేసిన పని వెనుక విధిప్రేరణ ఉంది " అని.

విశ్వామిత్రుడు యజ్ఞరక్షణకోసం శ్రీరాముడిని పంపించమని అడగడానికి వస్తే దశరధుడు " రాముడు పసివాడు, నేను వస్తాను మీతో " అంటారు. అప్పుడు విశ్వామిత్రుడు " శ్రీరాముడు గురించి నాకు తెలుసు, వశిష్టునికి తెలుసు, తపస్సు చేసుకునే ఋషులకు తెలుసు " అంటారు. అదీ మన ఋషుల శక్తి. భరద్వాజుడు ఋషేకదా. శ్రీరాముడి గురించి ఆయనకు తెలియనిది ఏముంటుంది.

అదీ శ్రీరాముడి ఔన్నత్యం. దేవతలను ఋషులనే కాదు, ధర్మమార్గంలో నడిచే రాక్షసులను కూడా రక్షించాడు, వారికి సుఖాలని ఇచ్చాడు. విభీషణుడిని లంకాధిపతిని చేసాడుగా. ధర్మకంటకులనే చంపాడు రాముడు.

రాముడికి కులం, మతం, ప్రాంతం లేదు. ఆయన అందరివాడు. ధర్మాన్ని అనుసరిస్తే చాలు, రక్షకుడవుతాడు.

గరుత్మంతుడు శ్రీరాముడిని " రిపుణామతి వత్సలా - శతృవులను కూడా ప్రేమించేవాడు " అని కొనియాడారు అందుకే.

జగదానందకారకుడు, మర్యాదాపురుషోత్తముడు.

" శ్రీరామరక్ష సర్వజగద్రక్ష ".

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ