ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించమని ఎప్పుడూ చెప్పలేదు రాముడు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" సత్యమేవేశ్వరో లోకే
సత్యం పద్మాశ్రితా సదా,
సత్యమూలాని సర్వాణి
సత్యాన్నాస్తి పరం పదా "
" సత్యమే లోకాన్ని నడుపుతూన్న పరమేశ్వరుడు. సత్యాన్ని ఆశ్రయించే ఐశ్వర్యం ఉంటుంది. సర్వ ధర్మములు సత్యమూలములు " అని శ్రీరాముడు జాబాలిమహర్షి తో అంటారు.
శ్రీరాముడిని ఎలాగయినా అయోధ్యకు తిరిగి తీసుకునివెళ్ళాలని భరతుడితో సహా అందరూ ప్రయత్నిస్తారు. వారిలో దశరధుడి సలహాదారుడు జాబాలి మహర్షి కూడా ఉన్నారు. ఆయన అంటారు " రామా ఎవరు తండ్రి, ఎవరు తల్లి. ఎవరి కర్మలు వారివే. తండ్రి బీజం తల్లి గర్భంలో పడి ప్రాణం పోసుకుంటుంది. పుట్టుకకు అది ఒక కారణం అంతే. తండ్రికిచ్చిన మాట అంటూ నువ్వు కూర్చోనక్కరలేదు. రాజ్యాన్ని పాలిస్తూ నీ ధర్మం నిర్వర్తించు " అని.
" నేను సత్యానికి కట్టుబడ్డాను. మా తండ్రి సత్యాన్ని కాపాడడమే నా సత్యం.
మాతండ్రి సత్యాన్ని నేను కాపాడకపోతే ఆయనకు అసత్యదోషం కలిగి ఆయనకు ఉన్నతలోకాలు ప్రాప్తించవు. నేనే అలా చేస్తే ప్రజలుకూడా అలాగే చేస్తారు, నేను అధోగతిపాలవుతాను. అధర్మాన్ని ధర్మంలా కనిపించేలా శాస్త్రవిరుద్ధంగా మాట్లాడారు మీరు. మీ మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. మీవంటివారు నాతండ్రికి సలహాదారుగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను " అంటారు శ్రీరాముడు.
మర్యాదాపురుషోత్తముడు ఎప్పుడూ మెత్తగా ఉంటారు అనుకోకూడదు. ధర్మకంటకులను చీల్చిఛెండాడుతారు. అవసరమైనప్పుడు పెద్దవారు చెప్పిన మాటలు కూడా ధర్మసమ్మతం కాకపోతే ఖండించాలి.
ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించమని ఎప్పుడూ చెప్పలేదు సనాతనధర్మం, చెప్పదు కూడా.
ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా గడగడలాడుతారో అతనే రాముడు అన్నారు పండితులు.
అప్పుడు జాబాలి " నన్ను మన్నించు. నేను శాస్త్రాన్ని నమ్ముతాను. నాస్తికుడిని కాను. నీమీద అభిమానంతో ఎలాగయినా అయోధ్యకు తిరిగి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే అలా మాట్లాడాను " అనడంతో శ్రీరాముడు చల్లబడ్డాడు.
సత్యవాక్పరిపాలకుడు. శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment