జపాపుష్పనిభాకృతిః - త్యాగయ్య ఆరాధనోత్సవము నేడు - చీమలపాటి సూర్యనారాయణ
🙏 శ్రీమాత్రేనమః 🙏
" జపాపుష్పనిభాకృతిః " - అమ్మవారి ఒక అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 766 వ నామం.
అంటే " మంకెనపువ్వుతో సమానమగు ఆకారము కలిగినది " అని.
" నిభా " అంటే కాంతి. అమ్మవారి చైతన్యం ప్రతీజీవిలోనూ హృదయంలో " పుష్ప " రూపంలో ఉంటుంది. ఇది ముడుచుకుని " మొగ్గ " రూపంలో ఉండి అమ్మవారికి సాధనతో దగ్గరయ్యేకొలదీ పుష్పంగా విచ్చుకుని కాంతిని సంతరించుకుంటుంది. జీవుడు ఉత్తముడవుతాడు.
అమ్మవారు స్పష్టంగా చెప్పింది. యజ్ఞాలు, పూజలు, స్తోత్రపఠనం ఏమీ శక్తికిమించి చేయనక్కరలేదు. ఏదో ఒక నామజపం చేసుకున్నా చాలు అని. ఆ జపంతోనే మొగ్గ రూపంలో ఉన్న అమ్మవారి చైతన్యం పుష్పరూపం సంతరించుకుంటుంది. యజ్ఞాలు పూజలకు ఎన్నో వస్తువులు కావలసి ఉంటాయి. అవి శ్రమతో కూడుకున్నవి. జపానికి ఏముంది, కాళ్ళు కడుగుకుని ఓ చక్కటి ప్రదేశంలో కూర్చుని నామస్మరణ చేసుకుంటే చాలు. మంత్రం దేవతా స్వరూపం.
గీతలో పరమాత్మ కూడా " యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) " - " జపరూపాన్ని " అన్నారు.
త్యాగరాజస్వామి 96 కోట్ల శ్రీరామనామజపం చేసారు. కోటి జపానికే ఆయనకు శ్రీరామదర్శనం అయింది.
ఓ సారి త్యాగరాజు తన శిష్యులతో కలిసి సదాశివేశ్వరుడిని దర్శించుకోవడానికి పుత్తూరు సమీపంలో ప్రయాణిస్తూంటే ఓ యువతి వచ్చి ఆయన కాళ్ళమీద పడి " రక్షించండి " అని భోరున ఏడిచింది.
విషయమేమిటంటే ఆమె భర్త తొందరలో పొరపాటున కాలుజారి నేలబావి లో పడి చనిపోయాడు. పైకితీసుకువస్తే దానిప్రక్కన కూర్చుని ఏడుస్తూ అటు వస్తూన్న స్వామిని చూసి ఎవరో మహాత్ముడు, తన భర్తని బ్రతిగించగలడనే నమ్మకంతో వచ్చి ఈయన కాళ్ళమీద పడింది.
ఈయన చలించిపోయారు పోయినతను యువకుడు కావడంతో. ఆయన ఆశ్చర్యపోయారు - ఇదివరకూ ఇప్పుడూ కూడా అదే శరీరం, మరి చైతన్యం ఎక్కడకి పోయింది. నాలో ఉన్నది ఇతనిలో ఉన్నది ఒకే చైతన్యం కదా. అందరిలో ఉన్న చైతన్యం దైవస్వరూపమే కదా అనుకుంటూ ధ్యానంలో కూర్చుని ఆర్తితో:
" నా జీవాధారా, నానోము ఫలమా, నా ' జపవర్ణ ' రూపమా... " అని బిళహరి రాగంలో కృతి పాడడం, పోయిన ఆ యువకుడు లేచి కూర్చోవడం జరిగింది.( స్వామి ఇక్కడ "జపాపుష్పనిభాకృతిః"ని స్మరించారు).
జపానికి అంత మహత్తు ఉంది. ఆర్తితో శరణువేడాలి కాని అమ్మవారు అనుగ్రహించకుండా ఎలా ఉంటుంది జపరూపమే ఆవిడ అయినప్పుడు.
నారదులవారు ఉపదేశించిన " ఓం నమో భగవతే వాసుదేవాయ " అనే మంత్రజపంతో ధృవుడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది చిరస్థాయిగా నిలిచిపోయాడు. ప్రహ్లాదుడు " ఓం నమో నారాయణాయ " మంత్రంతో తరించాడు.
రాజశ్యామలయాగం, అశ్వమేధయాగాలు చెయ్యక్కరలేదు. అవి అమ్మ అనుగ్రహంతో చెయ్యవలసినవారు, చెయ్యగలిగినవారు చేస్తారు.
శక్తికి మించినవి చెయ్యకూడదు, అవసరం లేదు. అమ్మవారు చెయ్యమని ఎప్పుడూ ఎక్కడా చెప్పనూ లేదు కూడా.
ఈరోజు త్యాగయ్య ఆరాధనోత్సవము ( వర్ధంతి )" - స్మరించుకుని తరిద్దాం. నివాళులు తెలియచేసుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment