కైకేయి భయపడింది రాముడు అడవికి వెళ్ళనంటాడేమోనని - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

" యావన్మాతరమాపృచ్ఛే

  సీతాం చానునయామ్యహం 

  తతో2ద్వైవ గమిష్యామి 

  దండకానాం మహద్వనం "

" మా అమ్మను, సీతను అనునయించి నేను వెంటనే దండకారణ్యానికి వెళ్ళిపోతాను " అంటారు రాముడు కైకేయితో.

కైకేయికి అనుమానం కలుగుతుంది దశరధుని పరిస్థితిని చూసి ఎక్కడ మనసు మార్చుకుని అడవికి వెళ్ళడం మానేస్తాడో రాముడు అని. అందుకని " నువ్వు ఇక్కడ ఉన్నంతవరకు మీనాన్న స్నానం, భోజనం చేయడు, నువ్వు వెంటనే బయలుదేరి అడవికి వెళ్ళు " అని అంటుంది.

రాముడు " అమ్మా, నీకు అనుమానమే అక్కరలేదు. నాకు అర్ధకామాలకన్నా ధర్మమే ముఖ్యమని నీకు తెలుసు కదా. అంత తొందరగా నా మనస్సు మారిపోదమ్మా " అని అంటూ పైవిషయం చెబుతారు.

నాన్నగారు పిలుస్తున్నారు అని కబురు వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంవదనంతోనూ చిరునవ్వుతోనూ కైకేయి అంతఃపురంలోకి వెళ్ళాడో " అరణ్యవాసానికి బయలుదేరు " అని ఆదేశించబడిన తరువాత కూడా అదే ప్రశాంతంవదనంతోనూ చిరునవ్వుతోనూ బయటకు వస్తాడు రాముడు. స్థితప్రజ్ఞుడు.

లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూంటే " నా అరణ్యవాసానికి కారణం కైకేయమ్మ అని మాత్రం ఎప్పుడూ అనుకోకు. ఆమె నన్ను ఇంతవరకూ ఎంత ప్రేమతో అభిమానంతో చూసుకుందో నీకు తెలియనిది కాదు. ఈ రోజు ఇలా జరిగింది అంటే తప్పు ఆమెదికాదు. దీని వెనుక ఏదో బలమయిన విధిప్రేరణ ఉంది అని తెలుసుకో " అంటాడు రాముడు.

అరణ్యవాసానికి వెళ్ళే ముందర తండ్రిని, తల్లిని కూడా ధర్మంను గుర్తుచేసి అనునయించి ఒప్పించాడు. అరణ్యవాసం దుర్భరమని, తనతో రావద్దని సీతను ఒప్పించే ప్రయత్నం చేసాడు. 

తల్లి తండ్రి ఆఖరుకు కులగురువు వశిష్టుడు కోరినా రాజ్యాన్ని స్వీకరించలేదు.

ధర్మాన్ని అనుసరిస్తే అర్ధకామాలు అవే వస్తాయని, ధర్మాన్ని వదిలేస్తే అర్ధకామాలు కూడా శాశ్వతంగా దూరమవుతాయని ఆచరించి తెలియచేసిన ధర్మమూర్తి రాముడు.

" రామో విగ్రహవాన్ ధర్మః "

" అందాల రాముడు

‌  అందువలన దేముడు "

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ