శంకరాచార్యులు తాను అయోగ్యుడిని అన్నారు ఎందుకో?- చీమలపాటి సూర్యనారాయణ
🙏 "శ్రీమాత్రేనమః " 🙏
" పుష్కరా, పుష్కరేక్షణా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 804,805 వ నామాలు.
పుష్కరా అంటే పుష్టిని ఇచ్చునది/పోషించునది - జీవులన్నిటినీ. మరి మళ్ళీ " పుష్కరేక్షణా " ఏమిటి/ఎందుకు. ఇది ఒక అద్భుతనామం. " తామరపువ్వుల వంటి కన్నులు కలది " అని భాష్యం చెప్పారు కాని " పుష్కర + ఈక్షణ - చూపులతోనే పోషించునది " అని అర్ధం చెప్పుకోవచ్చు.
శంకరాచార్యులు " నేను అయోగ్యుడిని, వెనుక వరుసలో ఉంటాను ( యోగ్యులు అమ్మవారికి ముందు వరుసలలో ఉంటారని ఆయన భావం ), నామీద కూడా నీ చూపులు ప్రసరించి అనుగ్రహించు " అని ప్రార్ధిస్తారు.
దేవతలందరూ ఏవో కొన్ని కోరికలతో అమ్మవారి దర్శనానికి వస్తారుట మణిద్వీపానికి. ఆవిడ చిరునవ్వుతో కూడుకున్న కళ్ళను చూసేటప్పటికే అన్నీ మర్చిపోతారుట. " ఏమి కావాలి " అని అమ్మవారు చిరునవ్వుతో అడిగితే " ఏమీ లేదమ్మా, మీదర్శనంకోసం వచ్చాము " అని తిరిగి వెళ్ళిపోతారుట.
కాంచీపురంలో " కామాక్షీ " దేవి కొలువై ఉన్నారు. కామ అంటే కోరిక. ఆవిడ కళ్ళ ( చూపు ) తోనే కోరికలను తీర్చేస్తుంది కనుక కామాక్షీ అని కొలుస్తారు.
1980 లలో మద్రాస్ లో ఉన్నప్పుడు 2 రోజులు సెలవు వస్తే అమ్మవారిని దర్శనం చేసుకొద్దామని కాంచీపురం వెళ్ళాను. భక్తులు ఎక్కువగానే ఉన్నారు. నేను అమ్మవారి ముందుకు వచ్చేసరికి లైను ఆపేశారు. ఇలా అయిందేమిటీ అనుకున్నాను. ఈలోపులో ఓ ఫేమిలీ - తల్లీ తండ్రీ 2 పిల్లలు పెద్దవాళ్ళే వచ్చారు. ఎవరో రాజకీయనాయకుడో పెద్ద అధికారో అయి ఉంటారు. వారికోసమే లైను ఆపేసారు. లైను అమ్మవారి గర్భగుడి ముందునుంచే ( ఏ గుడిలో అయినా ఇలాగే ఉంటుంది ) వెళ్ళిపోతుంది. అక్కడ కాపలాగా ఉన్న అతను ఆ నలుగురుని లోపలికి పంపిస్తూ నా వీపుమీద చెయ్యి వేసి గర్భగుడిలోకి మెల్లిగా తోసేసాడు. అంతా క్షణంలో జరిగిపోయింది, ఆశ్చర్యం వేసింది. సరే హారతి ఇచ్చారు పూజారి. అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ తీసి ఇచ్చారు. అమ్మవారి కుడిభుజం మీద ఓ " బంగారు చిలక " ఉంటుంది. దానిని తీసుకొచ్చి ఒక్కొక్కరి చేతుల్లోనూ ఉంచారు, చివరగా నాచేతికి వచ్చింది. దానిని ( బంగారంది, బరువుగానే ఉంది ) కళ్ళకు అద్దుకుని తిరిగి పూజారికి ఇచ్చేసి ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ అమ్మవారి వేపు చూస్తే " సంతోషమేనా " అని కళ్ళతో నవ్వుతూన్నట్లు అనిపించింది.
అలా ఉంటాయి అమ్మవారి లీలలు. శంకరులు అలా ఎందుకన్నారో కాని ఆవిడ దృష్టిలో యోగ్యులు, అయోగ్యులు అనే తేడా ఎందుకుంటుంది.
ఏతత్ సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
🙏🙏🙏👌👍
ReplyDeletePl mention ur name n mobile number
ReplyDelete