" భూలోకానికి స్వర్గలోకానికి " తేడా ఏమిటి?- చీమలపాటి సూర్యనారాయణ-
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" భూలోకానికి స్వర్గలోకానికి " తేడా ఏమిటంటే భూలోకంలో సుఖానికి దుఃఖస్పర్శ, దుఃఖానికి సుఖస్పర్శ ఉంటాయి. స్వర్గలోకంలో అలాంటివి ఉండవు. అంతా సుఖజీవనమే.
దశరధమహారాజు వేటకి వెళ్ళాడు. ఆయనకు శబ్దభేది అనే విద్య తెలుసు. అంటే దూరంగా శబ్దం వినబడితే శబ్దం వచ్చినవేపు బాణంవేసి దానిని చంపగలగడం. సరయూ నది వడ్డున చెట్టు చాటున నుంచుని ఉన్నాడు. నదిలో నీరు తాగుతూన్నట్లుగా " గుడ గుడ " మని శబ్దం వినబడింది. జంతువనుకుని బాణం ప్రయోగించాడు. మనిషి ఆర్తనాదం వినబడింది. గబగబా అక్కడికి వెడితే ఓ మునికుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నీళ్ళ కోసం చెంబు ముంచడంతో అలా శబ్దం వచ్చింది. అతను( శ్రవణుడు) చనిపోతూ " ఈ చెంబులోని నీళ్ళను నా తల్లిదండ్రులకు వెంటనే ఇవ్వండి " అని చెప్పి మరణించాడు. చాలాబాధతో ఆ నీళ్ళను తీసుకొనిపోయి అతని తల్లిదండ్రులకు ఇచ్చి వారి కుమారుడి మరణవిషయం చెప్పాడు. ఆ తండ్రి బాధను తట్టుకోలేక నువ్వు కూడా పుత్రవియోగంతో మరణిస్తావని దశరధుణ్ణి శపిస్తాడు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ శాపం దశరధుడికి బాధకు బదులుగా పరమసంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే అంతవరకూ ఆయనకి సంతానం లేదు, ఈ శాపంతో తెలిసినదేమిటంటే " పుత్రవియోగంతో మరణిస్తావు " అన్నారు కనుక తప్పకుండా కొడుకు పుడతాడని.
దుఃఖానికి సుఖస్పర్శ, సుఖానికి దుఃఖస్పర్శ అలా ఉంటాయి. అమ్మవారి లీలలు అద్భుతం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment