భీష్మాష్టమి నేడు, భీష్ముడు మహాజ్ఞాని, తలుచుకుని తరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
" అచింత్యాః ఖలు ఏ భావాః,
నతాంస తర్కేణ సాధయేత్ "
- ( స్మృతివాక్యం )
" మనకు అందుబాటులో లేని ఆధ్యాత్మిక వేదాంతాది విశిష్టవిషయాలను దుర్బలమైన మన హేతువాదాలతోను కుయుక్తులతోనూ సాధించుటకు ప్రయత్నించరాదు. అలా ప్రయత్నిస్తే బుద్ధి, శక్తి క్షీణిస్తుంది " అని అర్ధం.
ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు అలా మిన్నకుండిపోయారు ఏమిటీ అని చర్చిస్తూంటారు కొందరు కుహనా మేధావులు.
భీష్ముడు జ్ఞాని, విష్ణుసహస్రాన్ని ప్రసాదించిన భాగవతోత్తముడు. ఇచ్ఛామరణం వరంగా పొందినవాడు, పరశురాముడి శిష్యుడు, తండ్రి కోరిక తీర్చడంకోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయిన యోగి. ద్రోణుడు ఆచార్యుడు - " ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్యః " - అంటే తను ఆచరిస్తూ ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. అటువంటివారికి ధర్మంగురించి, బాధ్యతలగురించి గుర్తుచెయ్యనక్కరలేదు.
కొన్ని అలా అలా జరిగిపోతూ ఉంటాయి. మంచి అయితే పరవాలేదు, చెడు అయితే అలా ఎందుకయిందని చూసుకుని జాగ్రత్తపడాలి అంతే కాని బాధ్యత ఎవరిది అని ఎక్కువగా ఆలోచించి ప్రయోజనంలేదు.
భీష్ముడి " బాధ్యత" గురించి చర్చించాలి అనుకుంటే వస్త్రాపహరణం దగ్గరకాదు, వెనక్కి జూదం దగ్గరకి వెళ్ళాలి. జూదం సప్తవ్యసనాల్లో ఒకటి, కురుసభలో జూదం మొదలయినప్పుడే " వీరు " అది వద్దు, కాదని ఆడినా పందేలు వద్దు అని చెబితే ఇంతవరకూ రానే రాదు కదా.
కురుసభలో వారు అలా ఎందుకు మిన్నకున్నారు అని ఆలోచన చేయనక్కరలేదు. అది ఖండిస్తే ధర్మం, ఖండించకపోతే అధర్మం అని అనకూడదు. ధర్మం అన్నది తనవరకే వర్తిస్తుంది. ఏది ధర్మమో ఏది అధర్మమో తన బుద్ధితో నిర్ణయం చేసుకుని ఆచరించడమే. ఎదుటివాడు చేస్తూన్నది ధర్మమా అధర్మమా అన్నది ఆలోచన చెయ్యక్కరలేదు. అది కాలక్షేపం కోసమే. ఆపని ఎవరికి వారు ఆలోచించుకోవలసినది.
ఈ కురుసభలో జరిగిన వృత్తాంతం నుంచి నేర్చుకోవలసినది జూదం ఆడడంవల్ల కలిగే దుష్ప్రభావాలు అలా ఉంటాయి అని. మిగతావన్నీ సంఘటనలే. ద్రౌపది " వస్త్రాపహరణం నాకు అవమానం, అలా జరగకుండా కాపాడు " అని కోరుకుంది కనుకే శ్రీకృష్ణపరమాత్మ కూడా కలిగించుకున్నాడు. ధర్మరక్షణకోసం కాదు.
మరి ఆ పరమాత్మే గోపికలు స్నానం చేస్తూన్నప్పుడు వస్త్రాలు ఎందుకు తీసుకుపోయి చెట్టుమీద కూర్చున్నాడు.
రమణమహర్షి, వేమనలాంటివారికే బట్టలమీద ధ్యాస ఉండదు. ఇంక మహాజ్ఞాని భీష్ముడికి " వస్త్రాల " విలువ గురించి తెలియదా, చెప్పాలా.
వివేకానందుడు పరస్త్రీలని తల్లిగా చూస్తాడు అంటే కొందరు కుహనామేధావులకు సందేహం, అది నటనేనని. కొందరు యువతులను వివస్త్రలుగా ఆయన ముందు నుంచోబెట్టారు(ట). స్పందనలు పరిశీలించారు. ఏముంటుంది?. ఆయన యోగి.
పాము కప్పను తినడం ప్రకృతిధర్మం. అడ్డుకుని నిలపెట్టవలసిన ధర్మమేమీ అక్కడలేదు. అలాగ ప్రతీది అధర్మము, ఆపాలి అని ఆలోచిస్తూ కూర్చోనక్కరలేదు.
ఆధునికవైద్యానికి భారతీయవైద్యానికి తేడా ఏమిటంటే వారు కారణం చూసి మందు ఇస్తారు, వీరు ( ఆయుర్వేదం ) కారణం వెనుక కారణం చూస్తారు. అలాగ ఆ కారణం దగ్గరే ఆగిపోకుండా కారణం వెనుక కారణాన్ని తెలుసుకుని జాగ్రత్తపడాలి అన్నది సందేశంగా గ్రహించాలి.
అదీ మన సంస్కృతి గొప్పదనం.
ఈరోజు " భీష్మాష్టమి " - భీష్ముడు పరమాత్మలో ఐక్యమయిన రోజు. ఆయనను స్మరించుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment