నవగ్రహదేవతలు అమ్మవారి పాదాలలో ఉన్నారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" దధానో భాస్వత్తామృత
నిలయో లోహితవపుః,
వినమ్రాణాం సౌమ్యో
గురురపి కవిత్వంచ
కలయన్! గతౌ మందో
గంగాధరమహిషి
కామాక్షి భజతాం,
తమః కేతుర్మాతస్తవ
చరణపద్మో విజయతే !!"
మూకశంకరులు కామాక్షీ అమ్మవారిమీద పంచశతి చేసారు. పాదారవిందశతకంలో ఇలా ప్రార్ధించారు:
అమ్మా, శివుని ఇల్లాలా, కామాక్షీ, నీ పాదకమలము ప్రకాశకత్వమును ధరించునది, మోక్షమును ఇచ్చునది, ఎర్రని ఆకృతి కలది, శాంతమైనది, గురువైనది, కవిత్వము నొనర్చునది, నడకయందు మాంద్యము కలది, తమస్సును బోగొట్టునది.
ఈపద్యంలో ఓ అద్భుతం దాగి ఉంది.
1. భాస్వన్ అంటే ప్రకాశమనేకాక సూర్యుడు అని ఇంకొక అర్ధం ఉంది. భాస్వత్త అంటే అమ్మవారి చరణమునందు సూర్యత్వమున్నది అని భావం.
2. అమృతనిలయం - అమృతమంటే దేవతల ఆహారం. చంద్రుడు దేవతలకు అమృతనిలయమైన భోజనపాత్ర అనవచ్చును. అమ్మవారి పాదంలో చంద్రుడు ఉన్నట్లు.
3. లోహితవపువు అంటే అమ్మవారి పాదం ఎర్రగా ఉందని. అంగారకుడి శరీరం కూడా ఎరుపే. అంటే ఆమె పాదంలో అంగారకుడు ఉన్నట్లు.
4. సౌమ్య అంటే శాంతమనే కాక సోముడి కొడుకు సౌమ్యుడు అని. చంద్రుడి కొడుకు బుధుడు. అంటే ఆమె పాదంలో బుధుడు ఉన్నాడని.
5. గురు లో గు అంటే చీకటి, రు అంటే తొలగించునది అని అర్ధం. అమ్మ పాదం లో గురువు ఉన్నారని అనుకోవచ్చు.
6. కవిత్వం కలయన్ అంటే కవిత్వం కలది అని. శుక్రుడికి ఇంకోపేరు కవి. అంటే అమ్మవారి పాదంలో శుక్రుడు ఉన్నారని.
7. అమ్మవారి నడక మెల్లిగా అంటే మందంగా ఉందిట. శనైశ్చరుడికి మంద అని ఇంకో పేరు ఉంది. అంటే శనైశ్చరుడు కూడా ఉన్నట్లు.
8. తమః కేతుః. తమః అంటే చీకటి/అజ్ఞానం. రాహువు తమస్స్వరూపుడు. కేతుః అంటే ఇంకో అర్ధం అగ్ని, జ్ఞానాన్ని/వెలుగుని ఇచ్చేవాడు. అంటే రాహు, కేతువులు అమ్మవారి పాదంలో ఉన్నారని అనుకోవాలి.
ఈరకంగా నవగ్రహాలు అమ్మవారి పాదాలలో ఉన్నట్లుగా భావించాలి.
అందుకనే ప్రవచనకర్తలు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది, పీడలు ఉండవని చెబుతూంటారు.
నిజమే కాని ఆవిడపాదాలు పొందడం అంత సులభమా.
అమ్మవారు " అభ్యాసాతిశయజ్ఞాత " - " అమ్మవారిని అతిశయించిన అభ్యాసం/సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు " అని.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment