పాశహస్తా - కోతిని తాడుతో కట్టేసినట్లు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" పాశహస్తా, పాశహంత్రీ " - ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 810, 811 వ నామాలు.
" పాశహస్తా " అంటే ( ఎడమ ) చేతిలో పాశము గలది. పాశము దేనికండీ, ఎవరిని కట్టేయడానికీ అని అనుమానం రావచ్చు. అమ్మ కదా, పిల్లల జాగ్రత్త కోసం అనుకోవాలి. ఆవులో ఎద్దులో ఉన్నాయంటే వాటిని పలుపుతాడుతో కట్టి ఉంచుతారు. బయట మేయడానికో నీరు త్రాగడానికో కట్టు విప్పుతాడు యజమాని, మళ్ళీ కట్టేస్తాడు. అమ్మవారికి తెలుసు ఎప్పుడు కట్టి ఉంచాలో ఎప్పుడు విప్పుతూండాలో. మాయలోపడి కొట్టుకుపోకుండా కాపాడుతూ ఉంటుంది.
" పాశహంత్రీ " అంటే పాశాన్ని, బాధని తొలగిస్తుంది అని అర్ధం. మన తప్పులేకపోయినా అప్పుడప్పుడు కొన్ని బాధలు కలుగుతూంటాయి. ఆవిడే తొలగించేస్తూ ఉంటుంది. బాధ మరీ ఎక్కువది అయితే ఆవిడకు వదిలేయడమే మంచిది. మనం ప్రయత్నాలు చేస్తూన్నంతవరకూ ఆవిడ " తను చూసుకుంటున్నాడు కదా " అని వదిలేస్తుంది. ఈ విషయం మనం " గజేంద్రమోక్షం " లో చూడవచ్చు. ఇంకనావల్ల కాదు అని గజేంద్రుడు " శరణాగతి, నువ్వే రక్షించాలి " అని అన్నప్పుడే స్వామి వచ్చారు.
అలాగే మనం ఏదయినా మంత్రజపం చేస్తూన్నప్పుడు మనస్సు ఎక్కడికో పోతూంటుంది. మళ్ళీ జపం మీదకి మనస్సు మరలాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి.
ఆదిశంకరులు " శివానందలహరి " చేస్తూ అంటారు :
" సదా మోహాటవ్యాం చరతి
యువతీనాం కుచగిరౌ,
నటత్యాశాశాఖా స్వటతి
ఝటితి స్వైర మభితః ,
కపాలిన్ భిక్షో మే
హృదయకపి
మత్యంత చపలం ,
ధృఢం భక్త్వా బద్ధ్వా శివ
భవదధీనం కురు విభో " .
" ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భక్తి ( అనే తాడు ) తో కట్టి నీ దగ్గర ఉంచుకో స్వామీ " అని.
మనం కూడా మన మనస్సులను తన పాశంతో బంధించి తనదగ్గరే ఉంచుకుని అనుగ్రహించమని ఆ " పాశహస్త " ని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Good pos enlightens our spiritual knowledge
ReplyDeletePl mention ur name n mobile number
ReplyDelete