ధర్మం వేరు. ధర్మసూక్ష్మం వేరు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
ధర్మం వేరు. ధర్మసూక్ష్మం వేరు.
కొన్ని విషయాలు పైకి అధర్మంలా కనబడుతాయి. కాని తరచి విచారించి చూస్తే ధర్మమని తెలుస్తుంది. అదే ధర్మసూక్ష్మం. ఈ విషయం తార వాలితో రెండోసారి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెబుతుంది.
వాలి అంటాడు తారతో - రాముడు ధర్మాత్ముడు అంటున్నావు కదా, నాతో అతనికి శత్రుత్వంలేదు కదా, నన్నెందుకు చంపుతాడు. చంపుతే రాముడు అధర్మపరుడేగా - అని. అప్పుడు ధర్మసూక్ష్మం గురించి చెబుతుంది తార.
నిన్ను చంపడం అధర్మం కదా అని అంటావు నువ్వు. కాని రాముడు పరమధర్మాత్ముడు. ఆయన ధర్మాన్ని కాదు, ధర్మసూక్ష్మాన్ని చూస్తారు.
" సుగ్రీవుడు నీ తమ్ముడు. తమ్ముడు కొడుకుతో సమానం. అతను ఎప్పుడూ నీకు చెడుచేయాలని అనుకోలేదు, చెడు చేయలేదు. ఎల్లప్పుడూ నీ మంచినే కోరాడు. అతను ఎల్లప్పుడూ నీ ప్రక్కన ఉండాలి. అతనితో శతృత్వాన్ని వదిలేసి ఆదరించు " అని చెబుతుంది తార. స్త్రీజాతి ఉన్నతమనస్సును రాజనీతిజ్ఞతను ఎంత అద్భుతంగా తెలియచేసారు వాల్మీకిమహర్షి.
రాముడు బాణం వేసి కొట్టాడు వాలిని. కాని వెంటనే చనిపోయేటట్లు కొట్టలేదు. ఎందుకని?. వాలి సందేహాలు తీర్చాలి కదా. ధర్మసూక్ష్మం తెలియచేయాలి కదా. రాముడు చెట్టు చాటునుంచి కొట్టడం అధర్మంలా కనిపిస్తుంది కాని దానిలో ఉన్న ధర్మసూక్ష్మం తెలుసుకుంటే సందేహం తీరుతుంది.
అలాగే కృష్ణపరమాత్మ, భీష్ముడు, ద్రోణుడు మొ.గు వారు చేసినది అధర్మం కదా అని అనిపిస్తుంది కొందరికి. కాని తరచి చూస్తే దానిలోని ధర్మసూక్ష్మం తెలుస్తుంది. వారందరు పరమధర్మాత్ములు. వారి జీవితాలలో అధర్మానికి తావులేదు. ఆ దృష్టితో ఆలోచించి మంచి గురువును పట్టుకుని అలా " అధర్మం " లా కనిపించిన విషయం వెనుకనున్న " ధర్మసూక్ష్మం " ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి.
రామో విగ్రహవాన్ ధర్మః - శ్రీరామచంద్రుడు.
ధర్మస్య ప్రభుః రక్షితః - కృష్ణపరమాత్మ.
ఓ చక్కటి ఉదాహరణ చూద్దాం. పిల్లలకి తల్లిదండ్రులు తమవిషయంలో చేస్తూన్న కొన్ని పనులు అధర్మంగా కనిపిస్తూంటాయి. కానీ తరచి చూస్తే ధర్మసూక్ష్మం కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అధర్మం చేయరు ఎప్పుడూ. వారు తమ పిల్లలవిషయంలో నిస్వార్ధపరులు. పిల్లల ఉన్నతి, క్షేమం కన్నా వారికి కావలసినది ఏమీ ఉండదు.
గొప్పవారి విషయంలో ఏదయినా " అధర్మం " గా అని అనిపిస్తే " ధర్మసూక్ష్మం " ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment