ఆయుర్వేదం కారణం వెనుక కారణం చూస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
నిన్న ఒక అద్భుతమయిన వార్త చదివాను. సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగారు ఓ చక్కటి విషయం తెలియచేసారు ఈరోజు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ. ఆయనకు 3 సార్లు కోవిడ్ ( కరోనా ) వచ్చిందిట. 3 సార్లూ ఆయుర్వేదం మందే వాడారుట. ఆయుర్వేదం మందులు మంచిఫలితాన్నిస్తాయని ఆయనకు సలహా ఇచ్చింది మన ప్రధానమంత్రిగారే అని కూడా తెలియచేసారు ఆయన. ఇంగ్లీషుమందుల జోలికిపోలేదన్నారు.
ముఖ్యంగా ఆయన అన్నది " ఆయుర్వేదమందులు ఇంత అద్భుతంగా పనిచేస్తాయా అని ఆశ్చర్యం వేసింది. ప్రజల్లో సత్వరమే ఆయుర్వేదంమీద అవగాహన పెంచవలసిన అవసరం ఎంతయినా ఉంది " అని.
కుహనామేధావులు మన ఆయుర్వేదాన్ని భ్రష్టుపట్టించేసారు. ఇంగ్లీషువైద్యం కారణం చూస్తుంది, ఆయుర్వేదం కారణం వెనుక కారణం చూస్తుంది. ఉదా. శరీరం వేడిగా ఉంటే వేడి తగ్గడానికి మందులు ఇస్తుంది ఇంగ్లీషువైద్యం. అసలు వేడి ఎందుకు పెరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసి మందులు ఇస్తుంది ఆయుర్వేదం.
ఈ వైద్యానికి ఆయుర్వేదం ( ఆయుః + వేదం ) అని పేరుపెట్టి వేదంలా గౌరవించారు మన ఋషులు.
మా చిన్నప్పుడు మా అమ్మగారు ఓ అద్భుతమయిన విషయం చెప్పేవారు. 1930లలో ఓ ఆంగ్ల ఉన్నతాధికారి భార్యకు విపరీతంగా తలపోటు వచ్చేదిట తరచుగా. బ్రిటన్, అమెరికాలలో ఎందరో వైద్యులను కలిసారు, ఎన్నో మందులు వాడారు. ప్రయోజనం కలుగలేదు.
ఆ సమయంలో వారు రాజమహేంద్రవరం రావడం జరిగింది. వారి సహాయకుడు తలపోటు వ్యవహారం విని " ఇక్కడ ఒక మంచి ఆయుర్వేదవైద్యులు ఆచారిగారు ఉన్నారు. ఓసారి కలుస్తారా " అని అడుగుతే వారు నమ్మకం లేకపోయినా పోయేదేముంది అనుకుని " సరే " అన్నారు. ఆచారిగారిని అడిగితే మరునాడు 8 గం.లకు ఏమీ తినకుండా రమ్మన్నారు. నాడిచూసి 10/12 ప్రశ్నలు వేసి సాయంత్రం 5 గం.లకు రమ్మన్నారు. అప్పుడు కూడా నాడి పరీక్షించి కొన్ని ప్రశ్నలు వేసి మరునాడు ఉదయం 8 గం.లకు రమ్మన్నారు. అప్పుడు మళ్ళీ నాడిచూసి " మీ ముక్కుకు ఉన్న ఆభరణం తీసేయండి, సరిపోతుంది. మందులేమీ అక్కర్లేదు, వెళ్ళిరండి " అన్నారు. వారికి మతిపోయింది.
ఇంతకీ విషయమేమిటంటే ఆవిడ ముక్కుకు ఉన్న ఆభరణంలో ఒక ఖరీదయిన వజ్రం ఉంది. పగలు రాత్రి అని తేడా లేకుండా చిన్నకాంతి దానిమీద పడినా పరివర్తనం చెంది కంటిమీద పడుతూంది. దానివల్ల తలపోటు వస్తూంది ఆవిడకు. అదీ తలపోటు అనే కారణం వెనుక ఉన్న కారణం.
ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సంప్రదాయాలను పాటిస్తూ మన సనాతనధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం ప్రారంభించాలి/ప్రారంభిద్దాం.
" నాన్యపంథా అయనాయ విద్యతే ( పురుషసూక్తం )" - ప్రపంచమనుగడకు మన సనాతనధర్మం తప్ప వేరే దిక్కు లేదు.
హమారా ఆయుర్వేదం, సనాతనధర్మం మహాన్.
ఈరోజు మాఘపౌర్ఢమి/మహామాఘి. శుభాకాంక్షలు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment