ఆయుర్వేదవైద్యం - అర్ధరాత్రి పెరుగన్నం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

మా అమ్మగారి చిన్నన్నయ్యగారు అంటే నా చినమేనమామగారు సంస్కృతపండితులు. ఆయన ఓ బాలమేధావి. కీర్తనలు అద్భుతంగా పాడేవారుట. ముఖ్యంగా ఆయుర్వేదవైద్యం చేసేవారు. పేదవారికి ఉచితంగా వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

వారు అమలాపురంలో నివసించే సమయంలో వీరి ఇంటికి నాలుగిళ్ళ అవతల ఓ బాగా డబ్బున్నాయన ఉండేవారు.

ఓ రోజు ఆ ఇంటి యజమానురాలు ఏదో పనిమీద పిలిస్తే మా అత్తయ్య వారి ఇంటికి వెళ్ళారు. ఏవో మాట్లాడుతూ " మీ అమ్మాయి ఏదీ, కనిపించటంలేదు ఈమధ్య " అని మా అత్తయ్య అడిగితే ఇంటావిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని ప్రక్క గదిలోకి తీసుకుని వెళ్ళారు మా అత్తయ్యని. మా అత్తయ్య హతాసురాలయింది వారి అమ్మాయిని చూసి. 10/12 ఏళ్ళు ఉంటాయి, బొద్దుగా అంచక్కా ఉండేది ఆ అమ్మాయి. సన్నగా అయిపోయి మంచానికి అంటుకుపోయి ఉంది. కళ్ళలో చైతన్యంలేదు, మాట్లాడలేకపోతూంది.

ఏమయింది అని అడిగితే 20 రోజులయింది జ్వరం వచ్చి, డాక్టరుగారు మందులు ఇస్తున్నారు. ఏమీ పాలుపోవటంలేదు, రోజు రోజుకీ నీరసించిపోతూంది అని బాధపడ్డారు ఆవిడ.

ఇంటికొచ్చాక మా మేనమామగారితో విషయం చెప్పి ఓసారి మీరు వెళ్ళి చూస్తే నయమేమోనండి అంటే ఆయన " డాక్టరుగారు చూస్తున్నారు కదా, మళ్ళీ మనం చూస్తే బావుండదు " అనడంతో వదిలేసారు. 2/3 రోజుల తరువాత అత్తయ్య ఎలావుందో పాప అని వెళ్ళి చూస్తే ఇంకా దారుణంగా అయింది పరిస్థితి. " ఓ సారి శాస్త్రిగారిని వచ్చి చూడమంటారా" అని ఇంటావిడని అడిగితే " అయ్యో ఎంతమాట " అని వెంటనే ఇంటాయిన్ని పంపించారు మేనమామ దగ్గరికి " వచ్చి ఓ సారి పాపను చూడమని " అడగడానికి.

సాయంకాలం సంధ్యావందనం, జపం, పూజ అయిన తరువాత భోజనం చేసి 9 గం.లకు వారి ఇంటికి వెళ్ళారు మా మేనమామ.

అమ్మాయి నాడి చూసి ఇంట్లో కొత్తగా తోడుపెట్టిన పెరుగు ఉందా అని అడిగారు. ఉందనగానే వేడిగా అన్నంవండి పెరుగు కలిపి అమ్మాయిచేత తినిపించండి అనడంతో వారికి మతి పోయింది. జ్వరంగా ఉంది పైగా అర్ధరాత్రి పెరుగన్నం పెట్టమంటారేమిటీ అని.

" నేను మందు ఇస్తాను, భయపడకండి, రోజూ వచ్చి చూస్తాను. ఆ డాక్టరుగారు ఇచ్చే మందులు తీసుకోండి, వాడవద్దు, వాడట్లేదు అని మాత్రం ఆయనకు చెప్పకండి‌, బావుండదు " అని చెప్పి మందు ఇచ్చి అమ్మాయిచేత పెరుగన్నం తినిపించి ఓ గంట అక్కడే ఉండి వచ్చేసారు. 

రెండోరోజుకి కళ్ళలోకి వెలుగు వచ్చింది, మూడోరోజు మాట్లాడడం మెదలెట్టింది, నాలుగో రోజున లేచి కూర్చుంది పాప.

తరువాత ఆ అమ్మాయికి వివాహం అవడం, పిల్లలు పుట్టడం జరిగింది. 

ఆ డాక్టర్ గారు మాత్రం " చూసారా, ఎలా ఆ అమ్మాయికి నయం చేసానో " అని అందరికీ చెప్పుకుని మురిసిపోయేవారుట చాలాకాలం.

ఎందరో మహానుభావులు.

సర్వే జనాః సుఖినోభవంతు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ