సంసారం బురదలాంటిది - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" సంసారపంకనిర్మగ్న సముద్ధరణపండితా " - అమ్మవారి ఒక అత్యద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 880 వ నామం.
దీనిలో రెండు అద్భుతపదాలున్నాయి. ఒకటి " పంక " అంటే బురద. రెండు " పండితా " అంటే కుశలురాలు (స్పెషలిష్ట్) అని అర్ధం.
ఈ నామానికి అర్ధం " సంసారం అనే బురదలో పూర్తిగా మునిగిపోయినవారిని పైకితీసుకురాగలిగే కుశలురాలు " అని. అంటే రక్షించమని వేడుకుంటే " చెయ్యి " అందించి పైకిలాగుతుంది. సుబ్రహ్మణ్యస్తోత్రం లోనూ లక్ష్మీనృసింహస్తోత్రం లోనూ " మమదేహి కరావలంబం " - " నాకు చెయ్యి అందించి రక్షించు " అని వేడుకుంటాం.
సంసారంలో దిగడమంటే బురద/ఊబి లో దిగడమనే భావన మన సనాతనధర్మంలో వేలఏళ్ళుగా ఉన్నట్లు తెలుసుకోవాలి. జీవుల తాపత్రయాల్లో అధికభాగం సంసారానికి సంబంధించినవే అని అందరికీ తెలుసు.
ఈ సంసారబాధలు మనుషులకే కాదు, దేవుళ్ళకీ తప్పవు. శంకరుడు పార్వతి ఏదో అడుగుతే " అవును కాళీ " అన్నారు. కాళీ అంటే నల్లనిది అని అర్ధం. ఆవిడ అలిగి వెళ్ళిపోయి తపస్సు చేసి " గౌరి " అయింది. గౌరి వర్ణం పాలల్లో పసుపు కలిపినట్లు ఉంటుంది. భృగుమహర్షి ఏదో అనడంతో అలిగి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. వేంకటేశ్వరస్వామి అవతారం జరిగింది. బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తున్నారు. ప్రక్కన భార్య ఉండాలి కదా, సరస్వతీదేవి రావడం ఆలస్యం అయింది. గాయత్రీదేవిని కూర్చోబెట్టుకుని యజ్ఞం చేసేస్తున్నారు. సరస్వతికి కోపం వచ్చింది. లలితమ్మవారు " నీకు పూజయోగ్యం లేదు " అని శపించారు బ్రహ్మని, ఆ మాత్రం ఆగలేవా అని కోపంతో.
" ఇంద్రియార్ధేషు వైరాగ్యం
అనహంకార ఏవ చ,
జన్మమృత్యుజరావ్యాధి
దుఃఖదోషానుదర్శనం "
-- భ.గీ 13:9
పరమాత్మ కూడా గీతలో ఇవన్నీ దుఃఖహేతువులే అని తెలియచేసారు.
ఆదిశంకరులు ఇలా అన్నారు:
" జన్మదుఃఖం జరాదుఃఖం,
జాయాదుఃఖం పునప్పునః,
సంసారసాగరం దుఃఖం,
తస్మాత్ జాగ్రత జాగ్రత ".
" పుట్టడం, ముసలితనం, మళ్ళీ మళ్ళీ పుట్టుక, సంసారసాగరం అన్నీ దుఃఖహేతువులే. ఇవన్నీ సుఖాలిస్తాయని అనుకోవడం కేవలం భ్రమే. అందుకని జాగ్రత్తపడు " అని అర్ధం. ఎంత అద్భుత సత్యం.
వేదవ్యాసులు ఓ రోజు గంగానదీతీరాన ఏదో పనిచేసుకుంటూ ఓ పక్షులజంటను చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అప్పుడే గ్రుడ్డులోంచి బయటకు వచ్చిన పిల్లలనోటికి ఎక్కడనుంచో తీసుకువచ్చిన ఆహారాన్ని అందిస్తున్నాయి. పిల్లలు ఎర్రటినోళ్ళతో కిచకిచమని అరుస్తున్నాయి. " ఎంత అద్భుతంగా ఉంది, పక్షులే సంసారంలోని మధురానుభూతులను ఇలా ఆనందిస్తూంటే మనుషులగురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరమేముంది " అని అనుకున్న వ్యాసులవారికి కూడా వెంటనే ఓ కొడుకును పొందాలని కోరిక కలిగింది. శుకజననం జరిగింది.
విషయం ఏమిటంటే సంసారం ఓ దుఃఖసాగరం అని తెలిసినా ఎవరూ " వద్దు " అనుకోకుండా అందరూ దానిలో దూకుతూనే ఉన్నారు. కారణం ఏమిటంటే అమ్మవారు " విష్ణుమాయావిలాసిని " - మాయలో పడేసి వేడుక చూస్తూంటుంది. మాయలేకపోతే సృష్టి ఎక్కడిది. ఇంత చైతన్యం, అందం ఎక్కడివి.
సంసారసాగరంలో పడడం ఎలాగూ తప్పదుకనుక మరీ నిండామునిగిపోయి బాధలు పడకుండా కొంచెం తేలిగ్గా బయటపడేలా చేయి అందించమని " పండిత " ను వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment