కొందరు " స్వయం " పీఠాధిపతులు వివాదాస్పదులు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" యద్యదాచరతి శ్రేష్ఠః
తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే "
- భ.గీత 3:21
" మహనీయుడయిన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును " అని తెలియచేసారు పరమాత్మ.
" యధా రాజా తధా ప్రజా " అని సామెత. రాజు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. అప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా మసలుతారు.
రాముడు అందుకే ఆదర్శపురుషుడు అయారు. వేలసంవత్సరాలుగా పూజింపబడుతున్నారు. గురువుమాట వేదవాక్కు. వశిష్టుడు వారి కులగురువు. తిరిగివచ్చి రాజ్యాన్ని స్వీకరించమని ఎవరు చెప్పినా రాముడు వినకపోవడంతో వశిష్టుడిని నచ్చచెప్పమంటారు. " తండ్రి మరణించాక పెద్దకుమారుడు రాజ్యాన్ని స్వీకరించి పాలనచెయ్యడం శాస్త్రసమ్మతమే కాని అధర్మం కాదు, వచ్చి రాజ్యాన్ని స్వీకరించు " అని వశిష్టుడి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు. " అది ఋజువర్తనం కాదు, అలా నాలాంటివారు చేస్తే ప్రకృతి ( సూర్యుడు, భూమి, గాలి, నీరు వంటివి ) సహకరించదు, కరువుకాటకాలతో ప్రజలు నానాబాధలు పడతారు " అంటాడు రాముడు. అంటే కులగురువు చెప్పినా కూడా రాముడు అత్యుత్తమమైన ధర్మానికే కట్టుబడ్డాడు. శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మం.
భీష్ముడు వివాహం చేసుకోబోనని తండ్రికి మాట ఇచ్చారు. తన గురువు, విష్ణువు అవతారం అయిన పరశురాముడు " వివాహం చేసుకో, నేను చెబుతున్నాను, పరవాలేదు " అన్నా వినలేదు. ఆయనతో యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు. అదీ మన ఆర్షధర్మ విశిష్టత. భీష్మాచార్యుడు.
కంచిపరమాచార్యులు, రమణమహర్షి వంటివారు ఆచార్యులు. " ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్యః " - తను ఆచరిస్తూ ఆచరింపచేసేవారు ఆచార్యులు.
కొందరు పీఠాధిపతులు ( స్వయం పీఠాల అధిపతులు ) వివాదాస్పదలవుతుంటారు. వారు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి అవడం కారణంగా.
అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. వారు ఆచరించే వాటినే పిల్లలు సాధారణంగా పాటిస్తూ ఉంటారు.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment