మాఘపాదివారం - నూపప్పు జీళ్ళు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

మాఘపాదివారం నేడు. మాఘమాసంలోని ఆదివారాలన్నీ సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైన రోజులు. సూర్యదేవుని అనుగ్రహం పొందడానికి మిక్కిలి అనుకూలమైన రోజులు.

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం

ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యవహం 

స్వామి మంకెనపువ్వులా ఎర్రగా ఉంటారు. ఉదయాన్నే తూర్పుదిక్కుకి చూస్తే చాలు, ఆయన ఎలా ఉంటారో తెలిసిపోతుంది.

ఆయన ఆరోగ్యప్రదాత. నదీస్నానం చేసి ఆయనకు పొంగలి నైవేద్యం సమర్పిస్తే సంతోషపడతారు స్వామి.

మాగ్రామానికి 2 కిమీ ల దూరంలో గోదావరి నది ఉంది. తెల్లవారకట్టే స్నానాలకు వెళ్ళేవారు నా చిన్నతనంలో. 

ప్రతీపండుగకీ ముందరరోజు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే గరికిపాటివారు ఈ ముందరరోజుని " భోగి " అని అంటారు అని చెప్పారు. గోదావరి స్నానానికి మగవారు, పిల్లలు నడిచి లేక సైకిల్ మీద వెళ్ళేవారు. ఆడువారు ఎద్దులబండి , గుర్రపుబండి మీద వెళ్ళేవారు. మా అత్తయ్యగారికి ఎడ్లబండి ఉండేది. 4 గంల కల్లా వెళ్ళిపోయేవారం. బండి అతను ముందర నడుస్తూ వెడితే ఎద్దులు మెల్లిగా అతని వెనక నడిచి వెళ్ళేవి. నేను తొట్టెలో కూర్చుని ఎడ్లని అదిలిస్తూ ఉండడమే.

ఎప్పుడయినా ఎడ్లబండి ఖాళీ లేకపోతే " బండి వెంకన్న " కి ముందరే చెప్పేవారం. వెంకన్నకి గుర్రపుబండి ఉండేది. ఊరిలో అది ఒకటే. 4 ఆదివారాలు మంచి గిరాకీ అతనికి. 3 గంలకు మొదలయ్యేది మొదటి ట్రిప్పు. 4 గంలకు రమ్మని 2 రోజుల ముందరే చెప్పేవాడిని. ఆరుగురికి సరిపోయేది. నేను ఎదర కాడిమీద కూర్చునేవాడిని. వెంకన్నా బండి ఎక్కేవాడు, లేకపోతే బండి వెనక్కి వంగిపోతుంది. అక్కడ దింపి ఇంకో ట్రిప్పుకి వచ్చేసేవాడు. ఓ గంట తరువాత వచ్చి మమ్మల్ని తీసుకొచ్చేసేవాడు. 

" పెళ్ళివారిది పెళ్ళి హడావిడి, అడుసుకళ్ళవాడిది దోమల హడావిడి " అని సామెత. అందరిదీ స్నానాల హడావిడి అయితే మా పిల్లల హడావిడి వేరే. ఈ ఆదివారాల్లోనూ, తీర్థాల్లోనూ జీళ్ళు వచ్చేవి. ఎంత గట్టిగా రుచిగా ఉండేవో. వాటికోసమని పోయేవారం మేము. 

మధురస్మృతులు.

" భాస్కరాయ విద్మహే 

  మహాద్యుతికరాయధీమహి, 

  తన్నో ఆదిత్య ప్రచోదయాత్"

ఆ ప్రత్యక్షనారాయుడిని అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించి అనుగ్రహించమని కోరుకుందాం - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ