తాంబూలపూరితముఖీ - తాంబూలంలో అంత విషయం ఉందా? - చీమలపాటి సూర్యనారాయణ

🙏" శ్రీమాత్రేనమః "🙏

" తాంబూల పూరితముఖీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 559 వ నామం.

" తాంబూల పూరితముఖీ " అంటే తాంబూలం తో నిండిన నోరు ( ముఖం అంటే నోరు ) గలది అని అర్ధం. అమ్మవారికి తాంబూలం అంటే ఎక్కువ ఇష్టం. మహానివేదన అవగానే జాజిపత్రి పుదీనా ఏలకులు వేసిన తాంబూలం సమర్పిస్తారు. సువాసినీలు తాంబూలం తప్పకుండా వేసుకోవాలని చెబుతారు పెద్దలు. మనసంప్రదాయంలో శ్రావణమాసం, దేవీనవరాత్రులు, పువ్వుతాంబూలం, పండుతాంబూలం, పెళ్ళిళ్ళు ఇలా ఇంచుమించు ప్రతీరోజూ ఎదో ఒకరకంగా తాంబూలాలు వస్తూనే ఉంటాయి ఇళ్ళకి, ఇంట్లో పూజలో పెట్టిన తాంబూలం కాక. 

మా అమ్మగారు తరచూ తాంబూలం వేసేవారు. చూసి " నాకో " అని ఏడుపు మొదలెడితే నోటిలోంచి కొంచెం పిడచ ( మేము తమ్మి అంటాం ) తీసి మానోట్లో పెట్టేవారు. అమ్మ పెట్టే తమ్మి/పిడచ కి ఎంతమహత్తు ఉంటుందో తెలుసుకోవాలంటే మనం కాంచీపురం వెళ్ళాలి. 

కాంచీపురంలో ఓ మూగవాడు ఉండేవాడు. ఒంటరి కావడంతో ఊళ్ళో వాళ్ళకి ఆపనీ ఈపనీ చేసిపెట్టడం రాత్రి గుళ్ళో పడుక్కోవడం చేసేవాడు. ఆ కాలంలో ప్రయాణీకులు రాత్రి అయిపోతే ఆ ఊరిలో ఉన్న గుడిలో పెట్టే ప్రసాదం తిని గుళ్ళోనే పడుక్కుని మరునాడు పొద్దున్నే వెళ్ళిపోయేవారు. 

ఓరోజు ఓ మహాపండితుడు కూడా గుడిలో పడుకొన్నాడు. కొద్ది దూరంలో మూగవాడు పడుకున్నాడు.

అర్ధరాత్రి ఏదో చప్పుడయితే ఇద్దరికీ మెలుకువ వచ్చింది. చూస్తే ఒకావిడ ఇటూ అటూ నడుస్తున్నారు. ఆవిడ కామాక్షీ అమ్మవారు. తాంబూలం నములుతూ చిరునవ్వుతో విహారం చేస్తూంది. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూంటే నోట్లోంచి " తమ్మి " తీసి పండితుడి వేపు చేయిచాపింది. ఆయన " వద్దమ్మా, పైగా ఆడవారి ఎంగిలి నేను తీసుకోను " అనడంతో ఇటు తిరగ్గానే మూగవాడు ఆనందంతో నోరు తెరవడం, ఆవిడ ఆయన నోట్లో వెయ్యడం జరిగింది. 

వెంటనే ఒక అద్భుతం. మూగవాడు లేచి నుంచుని అమ్మవారికి నమస్కరించి ఆసువుగా 500 శ్లోకాలతో ఆవిణ్ణి స్తుతించాడు. దానినే " మూకపంచశతి " అని కొనియాడుతారు. ఇంకా అద్భుతమేమిటంటే ఓ 100 శ్లోకాలు అమ్మ చిరునవ్వును వర్ణిస్తూనూ, ఓ 100 శ్లోకాలు అమ్మ పాదాలను, ఓ 100 శ్లోకాలు అమ్మ కరుణాపూరితమైన చూపులను వర్ణిస్తూనూ పాడారు. మిగతా రెండు శతకాలు " ఆర్యా శతకం, స్తుతి శతకం ". ఈ మూగవాడు " మూకశంకరులు " గా ప్రసిద్ధి చెందారు.

పొంగిపోయిన అమ్మవారు " ఏమి కావాలో కోరుకో " అంటే " నిన్ను పొగిడిన నా నోరు ధన్యమయినది, మళ్ళీ నన్ను మూగవాడిని చేసేయి తల్లీ " అని కోరుకున్నాడు. జ్ఞాని.

అమ్మ " తాంబూలసేవన " లో అంతటి అద్భుతము, మహత్తూ ఉంది. 

ఏతత్ సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ