వేదమే ప్రపంచ శాంతికి దిక్కు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

నిన్న తేది.06.02.2024 న మా గ్రామంలో ఋగ్వేదసభల సందర్భంగా పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు " వేదం - దాని ప్రాముఖ్యత " గురించి అనుగ్రహభాషణం చేసారు. 

" వేదంలా ఘోషించే గోదావరి " - చుట్టూ గోదావరి. మధ్యలో కోనసీమలోని అగ్రహారం. ఆయన ప్రవచనామృతం గోదావరినదీ ప్రవాహంని తలపించింది.

ఆయన ప్రవచనం లోని కొన్ని ముఖ్య విషయాలు:

వేదం పరమేశ్వరుడి ఊపిరి. పరమేశ్వరుడే వేదం, వేదమే పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి మూలం లేనట్లే వేదానికీ మూలం లేదు. అది సృష్టించబడినది కాదు.

ప్రశ్నలు రెండు రకాలు. ఇంద్రియప్రశ్న, అతీంద్రియప్రశ్న. ఇంద్రియప్రశ్న భౌతికవిషయాలగురించి. అతీంద్రియప్రశ్న కనిపించని/ఊహకందని విషయాలగురించి. మొదటిదానికి పుస్తకజ్ఞానం కావాలి. రెండవదానికి మార్గం తపస్సు. దానిద్వారానే ఋషులు వేదం ను పొందారు.

అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసాడు. ఎప్పుడు?. దివ్యచక్షువులు పొందాక. శ్రీకృష్ణుడిది ఎప్పుడూ ఒకటే రూపం. కాని దివ్యచక్షువులు పొందాక అర్జునుడు స్వామి అసలురూపాన్ని/విశ్వరూపాన్ని చూడగలిగాడు. అలాగే ఋషులు తమ తపశ్శక్తితో పొందిన దివ్యకర్ణములతో వేదంని వినగలిగారు. విని దానిని లోకానికి ప్రసాదించారు. వేదం అపౌరుషేయం.

విష్ణుసహస్రంలో " వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిద్కవిః " అన్నారు. భయకృత్ ( భయాన్ని కలిగించేవాడు ), యజ్ఞకృత్, కామకృత్ అన్నట్లుగా వేదకృత్ అనలేదు. అంటే వేదం కలిగించబడలేదు. పరమేశ్వరుడు, వేదం వేరుకాదు.

శ్రీరాముడు వేదాలు, ఋషలు ఇలా చెబుతున్నారు, అలా చేద్దాం అనేవారు. కృష్ణపరమాత్మ " తస్మాత్ శాస్త్రం ప్రమాణం ( భ.గీత 16:24 ) " అని తెలియచేసారు గీతలో.

వేదం వల్ల ప్రయోజనం ఏమిటండీ అంటూంటారు చాలామంది. విశ్వానికి ఏదయినా ప్రయోజనం కలుగచేస్తూందంటే అది ఒక్క వేదమే. ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినిత్యమూ వేదపఠనం జరుగుతూండడం వల్లే సూర్యుడు చంద్రుడు వెలుగునిస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. వేదపఠనం ఆగిపోతే అంతా వినాశనమే అన్నారు.

పరమేశ్వరుడికి వేదం ఊపిరి అయితే దేవతలు ఇంద్రియాలు. ఊపిరి ఉన్నంతవరకే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలు అంటే సూర్యుడు చంద్రుడు వాయువు వరుణుడు భూమి. అంటే వేదం ఉన్నంతవరకే ప్రకృతి అంతా నియమబద్ధంగా పనిచేస్తూ ఉంటుంది అని తెలియచేసారు.

వేదం ( పురుషసూక్తం ) " శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే " అంది. అంటే రెండుకాళ్ళ జీవులు ( మనుషులు పక్షులు ), నాలుగుకాళ్ళ జీవులు ( జంతువులు ) కూడా బాగుండాలని చెబుతూంది వేదం. మనుషులు, భూమి, వృక్షాలు, నదులు, సముద్రము, గాలి, పక్షులు, జంతువులు - అన్నీ బాగుండాలని కోరుకుంటూన్నది ప్రపంచంలో ఒక్క వేదమే అని తెలియచేసారు.

వేదంని కాపాడుకుంటే ధర్మం రక్షించబడుతుంది. ధర్మం రక్షించబడితే ప్రపంచం శాంతితో మనగలుగుతుంది.

అందుకే యుగాల నుంచి ఈ వేదాలను నాశనం చేయాలని అప్పడు రాక్షసులు ఇప్పుడు ఇప్పుడు నరరూప రాక్షసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం జాగరూకతతో ఉండాలి.

వేదమే ప్రపంచశాంతికి దిక్కు అని తెలియచేస్తూ భక్తులకు/శ్రోతలకు ఆశీస్సులు అందించారు.

వేదో2ఖిలమూలం. 

అనన్తావై వేదాః.

ఏతత్ సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు - సూర్య.

శుభం భూయత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ