ఆయుర్వేద వైద్యులు - ఆపరేషన్స్ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
మా అమ్మగారి చిన్నన్నయ్యగారు అంటే నా చినమేనమామగారు సంస్కృతపండితులు. ఆయన ఓ బాలమేధావి. కీర్తనలు అద్భుతంగా పాడేవారుట. ఆయుర్వేదవైద్యం చేసేవారు.
ఈయన చదువుతో బాటు లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంధాలన్నింటినీ శ్రద్ధగా చదివేవారు. ముఖ్యంగా శుశ్రుతుడి వైద్యవిధానం, శస్త్రచికిత్సల గురించి. శరీరంలోని భాగాలన్నిటిగురించి చెబుతూ ఉండేవారుట.
చదువు అయిపోయినతరువాత చిన్న చిన్న కత్తులు, సూదులు లాంటివి తయారు చేయించుకుని ఓ కిట్ ఎప్పుడూ దగ్గర ఉంచుకునేవారుట.
శ్రీకాళేశ్వరం ( కరీంనగర్ ) దగ్గర మంథని అని ఓ గ్రామం ఉందని అక్కడ ఎక్కువగా వేదపండితులు ఉన్నారనీ వినడంతో ఈయన అక్కడికి మకాం వెళ్ళిపోయారు 1930లలో. అక్కడ స్మార్తకర్మలు చేస్తూ వేదపాఠాలు చెబుతూ ఆయుర్వేదవైద్యం చేస్తూ గడిపేవారు.
ఆ ప్రాంతం ఏజెన్సీ అవడంతో ఓ పొలీస్ ఉన్నతాధికారి ఆ ఊరిలో మకాం చేసేవారు. ఆయన కూతురు పురిటికి వచ్చింది అక్కడికి 7 వ నెలలో. ఆ ఊరిలో ఉన్న డాక్టర్ గారు చూస్తున్నారు ఆ అమ్మాయిని. ఓ రోజు ఆ ఇంట్లోంచి ఏడుపులు వినిపిస్తే మేనమామ గారు మా అత్తయ్యను వారి ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకునిరమ్మన్నారు. " కడుపులో పిల్ల చనిపోయిందనీనూ వెంటనే పట్నంకి తీసుకెళ్ళి ఆపరేషన్ చెయ్యకపోతే తల్లికూడా దక్కదనీనూ " చెప్పారుట వారి డాక్టర్ గారు వచ్చి చూసి. అమ్మాయి తండ్రి కేంపులో ఉన్నారు, కబురు పంపించారు, ఆయన రావడానికి 9,10 గం లు పట్టవచ్చని తెలిసింది.
మేనమామగారు వెళ్ళి ఆ అమ్మాయి నాడీ అవి చూసి " కడుపులో పిల్ల చనిపోలేదుకాని పరిస్థితి ప్రమాదంగానే ఉంది, మీరు ఊ అంటే ఆపరేషన్ చేసి పిల్లని తీస్తాను, తల్లికి కూడా ఏ ప్రమాదం ఉండదు, మీవారు కేంపునుంచి రాగానే మాత్రం పట్నానికి ఆలస్యం చెయ్యకుండా తీసుకెళ్ళాలి " అని చెబితే వాళ్ళు మాట్లాడుకుని ఓ కె అనడం ఈయన ఓ చక్కటి మందు ఇచ్చి ఆపరేషన్ చేసేయడం జరిగింది. తల్లి పిల్ల సేఫ్.
ఇప్పుడు అసలు విషయం - ఈ విషయం తెలిసి ఊళ్ళోని డాక్టర్ " అగ్గిమీద గుగ్గిలం " అయిపోయేడు. స్టేషన్ కి వెళ్ళి " అతను డాక్టర్ కాడు, డిగ్రీ లేదు, ఆ పిల్ల తల్లి చనిపోతే బాధ్యులెవరు, కేసు బుక్ చేసి వెంటనే ఆయన్ని ఖైదు చేయండి " అని కంప్లైంట్ ఇచ్చాడు. మేనమామగారి ఇంటిముందర ఇటూ అటూ తిరుగుతూ " వీణ్ణి చేతులకి సంకెళ్ళు వేసి పొలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళడం, ఇతని కుటుంబీకులందరూ భోరున ఏడవడం ఊళ్ళో అందరూ చూస్తారు ఈరోజు " అంటూ అరవడం మొదలెట్టారు. పొలీసులు వారి అధికారి రాక కోసం ఎదురు చూస్తున్నారు.
డాక్టరుగారి కోపం ఆరోజు జరిగినదానికి కాదు. ఎప్పటి నుంచో ఉన్నది అనుకోవచ్చు. మా మేనమామ లేనివారికి ఉచితంగా మందులు ఇవ్వడం అసలు కారణం.
అధికారి రావడం విషయాలన్నీ వినడం జరిగింది. ఓ కాగితమ్మీద ఏదో వ్రాసి వారి భార్యచేత సంతకం పెట్టించి పొలీసు ఆయనకి ఇచ్చి " వెళ్ళి ఆ డాక్టర్ కి సంకెళ్ళు వేసి శాస్త్రిగారి ఇంటిమీదుగా నడిపించుకుని తీసుకురండి " అని చెప్పడంతో అతను డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ " నువ్వు సరిగ్గా విని ఉండవు, ఆ శాస్త్రిని తీసుకురమ్మని ఉంటారు " అని అనడం, ఇతను నేను సరిగ్గానే విన్నాను అనడంతో ఆయన అధికారి ఇంటికి పరిగెత్తాడు. ఆయన అన్నారు " చంటిపిల్ల పోయిందని, తల్లి కూడా పోతుందన్నారుట మీరు, నా భార్య కంప్లైంట్ ఇచ్చింది, మిమ్మల్ని అరెష్ట్ చేసి మీ డిగ్రీ ఊడగొట్టించమంది " అని.
ఈయన " తప్పయిపోయింది, క్షమించండి " అంటే " నేను కాదు, శాస్త్రిగారు క్షమిస్తే కంప్లైంట్ వెనక్కు తీసుకుంటుంది మా ఆవిడ " అనడంతో ఆయన శాస్త్రిగారి ఇంటికి పరుగెత్తాడు.
ఈ విషయంలో నా చినమేనమామ గారింట్లో కొంచెం కలవరపడ్డారుగాని ఆయనకు ఇవేమీ పట్టలేదని, హాయిగా స్నానం చేసి గాయత్రీజపం చేసుకుంటూ కూర్చున్నారని చెప్పుకునేవారుట.
విషాదకరమైన విషయమేమిటంటే ఈయన 50 ఏళ్ళలోపే హఠాత్తుగా పోయేరుట. " చేతబడి చేసారు ఎవరో " అనుకునేవారుట ఊరిలో కాని విషప్రయోగం కూడా అయి ఉండవచ్చని ఇంట్లో అనుమానపడేవారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు- సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment