కీర్తనల్లో అంత అంతరార్ధం ఉంటుందా? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

వాగ్గేయకారుల కీర్తనలు సాధారణంగా 6/8 పంక్తులలో ఉంటాయి. పదాలు కూడా తేలికభాషలో ఉంటాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని సరిగ్గా సాహిత్యాన్ని చదివి అర్ధం చేసుకుంటే వారి అత్యద్భత విద్వత్తు తెలుస్తుంది, అబ్బురంగా అనిపిస్తుంది.

త్యాగయ్య ఓ కీర్తనలో ఇలా అంటారు:

" ఆడమోడి గలదే రామయ్య

  మాటలాడమోడి గలదే  

                          రామయ్య

  చదువులన్ని దెలిసి   

  శంకరాంశుడై

  సదయుదాశుగ సంభవుండు  

  మ్రొక్క గదలు తమ్ముని  

  బల్కజేసితివి గాకను   

  త్యాగరాజేపాటి మాటలా "

ఎంతో సామాన్యంగా కనబడుతూంది ఈ కీర్తన. మోడి అంటే బింకం(ట), తెలుగు పదం. 

కీర్తన అర్ధం:

" ఎన్నో కీర్తనలతో నిత్యం నిన్ను పూజిస్తూంటే నాతో మాట్లాడవేమిటయ్యా. అంత బింకమేమిటయ్యా?.

సకలశాస్త్రపారంగతుడు శంకరాంశుడు అయిన హనుమ ( ఆశుగసంభవుడు అంటే వాయుపుత్రుడు ) తోనే తమ్ముడు లక్ష్మణుడితో మాట్లాడించావు ( నువ్వు మాట్లాడకుండా ). ఇక నెనెంత అంటారు " త్యాగయ్య.

ఈ కీర్తనలో ఒక అద్భుతమైన రామాయణ ఘట్టం ఉంది. రామాయణం శ్రద్ధగా చదివిన/విన్న వారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది.

రామలక్ష్మణులు సీతాదేవిని వెదుకుతూ ఋష్యమూక పర్వతం దగ్గరకు వస్తూన్నప్పుడు సుగ్రీవుడు చూసి శతృవులేమో అని కలవరపడతాడు. 

హనుమ " వారెవరో, ఎందుకు వస్తున్నారో తెలియకుండా కలవరం చెందడం దేనికి, నేను వెళ్లి విషయాలు తెలుసుకుని వస్తాను " అని వెళ్ళి రామలక్ష్మణులకు సుగ్రీవుడి గురించి, తన గురించి చెబుతాడు. 

అప్పుడు అందరూ ఊహించుకున్నట్లుగా రాముడు " ఓహో అలాగా " అని హనుమతో మాట్లాడరు. హనుమ చెప్పిన తీరు, మాటలతీరు, సంస్కారంల గురించి రాముడు లక్ష్మణుడుతో చెప్పి " ఇటువంటి వ్యక్తి ఎవరికి దూతగా లభిస్తాడో అతని పనులన్నీ చక్కగా నెరవేరుతాయి " అంటారు. అప్పుడు లక్ష్మణుడు తామెవరో, ఏపనిమీద అక్కడకు వచ్చారో హనుమకు చెబుతారు.

ఇదే త్యాగయ్య అన్నది. అంత చక్కగా మాట్లాడిన సకలశాస్త్రపారంగతుడు హనుమతోనే నువ్వు మాట్లాడలేదు, తమ్ముడిచేత మాట్లాడించావు, ఇంక నేనేపాటి అని‌.

ఎంత అద్భుతం. అంత చిన్న కీర్తనలో ఇంత కధ ఉంది.

" పలికెడిది భాగవతం, అట పలికించెడివాడు రామభధ్రుండు, అట..... " అంటారు పోతనామాత్యుడు భాగవతంలో. స్వామి అనుగ్రహం లేకపోతే అంత అద్భుతంగా కీర్తనలు ఎలా వస్తాయి.

ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ